దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుసగా రెండో భారీ నష్టాలు సంభవించాయి. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో 800 పాయింట్ల వరకు పతనమైన బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 677.70 పాయింట్లు కోల్పోయి 59,306.93 పాయింట్ల వద్ద ముగిసింది.
అలాగే, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా 185.60 పాయింట్ల పతనంతో 17,671 పాయింట్ల వద్ద ముగిసింది. ఎనిమిది రోజుల్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీలు సుమారు రూ.17 లక్షల కోట్ల మేరకు మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కోల్పోయాయి.
శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో కేవలం 9 స్క్రిప్ట్‌లు లాభాలు పొందితే, 21 స్టాక్స్‌లో డౌన్ ట్రెండ్ కొనసాగింది. మార్కెట్ లీడర్ రిలయన్స్ షేర్లు 2.38 శాతం నష్టంతో రూ.2538 వద్ద స్థిర పడింది.
రిలయన్స్ ఎం-క్యాప్ రూ.16.09 లక్షల కోట్ల వద్ద నిలిచింది. అలాగే కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, లార్సెన్ అండ్ టర్బో, యాక్సిస్ బ్యాంక్, ఇన్‌ఫోసిస్ రెండు శాతం నష్టపోయాయి. ఇక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్సీటీసీ షేర్ 7.85 శాతం పతనంతో రూ.845.65 వద్ద స్థిర పడింది.
శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షలు పతనమైంది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్క్రిప్ట్‌లు మార్కెట్‌లో నష్టాలకు కారణంగా నిలిచినా కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు తిరిగి పుంజుకున్నాయి.