ఆసియా బాస్కెట్‌బాల్: భారత జట్టు ఓటమి

ఆసియా మహిళల బాస్కెట్‌బాల్ పోటీల్లో భారత జట్టుకు చుక్కెదురైంది. చెన్నై నగరంలో గురువారం జరిగిన ప్రారంభమ్యాచ్‌లో భారత జట్టు.. డిఫెండింగ్ ఛాంపియన్ కొరియా చేతిలో ఓటమిని చవిచూసింది.

"లెవల్ వన్" విభాగంలో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో భారత జట్టు కొరియాతో బరిలోకి దిగింది. అయితే ప్రత్యర్థి జట్టు ప్రదర్శించిన ఆటతీరుతో బెంబేలెత్తిన భారత జట్టుకు పరాజయం తప్పలేదు.

దీంతో ప్రపంచ బాస్కెట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 41వ స్థానంలోనూ, ఆసియా దేశాల్లో 7వ స్థానంలో ఉంది. మరోవైపు.. భారత్‌పై నెగ్గిన కొరియా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానాన్ని, ఆసియా దేశాల్లో అత్యున్నత స్థానంలో కొనసాగుతోంది.

అదేవిధంగా ఈ టోర్నీ లెవల్-2 విభాగంలో జరిగిన మ్యాచ్‌లలో ఫిలిప్పైన్స్ జట్టు 61-55 పాయింట్ల తేడాతో మలేషియాను మట్టికరిపించింది. మరో మ్యాచ్‌లో లెబనాన్ జట్టు 83- 68 పాయింట్ల తేడాతో ఉజ్భెకిస్థాన్ జట్టును ఓడించింది. అలాగే కజగస్థాన్ జట్టు 94-40 పాయింట్లతో శ్రీలంకపై నెగ్గింది.

వెబ్దునియా పై చదవండి