బ్రెజిల్ అనూహ్య ఓటమి: కోచ్ పదవికి డుంగా గుడ్ బై!

FILE
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న సాకర్ ప్రపంచకప్‌ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ బ్రెజిల్ అనూహ్య ఓటమికి బాధ్యత వహిస్తూ, ఆ జట్టు కోచ్ డుంగా తన పదవి నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (సీబీఎఫ్) ధ్రువీకరించింది.

హాలెండ్‌తో ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో బ్రెజిల్ పరాజయం పాలైంది. ఈ అనూహ్య ఓటమికి తానే కారణమని కోచ్ డుంగా అంగీకరించాడు. ఇదే కారణంతోనే బ్రెజిల్ ఓటమికి బాధ్యత వహించిన కోచ్‌ను ఆ పదవి నుంచి తప్పించినట్లు బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా, 1994వ సంవత్సరం బ్రెజిల్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినప్పుడు డుంగా బ్రెజిల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇతను 2006వ సంవత్సరంలో కోచ్‌గా నియామకమయ్యాడు.

ఈ నేపథ్యంలో 2010వ సాకర్ ప్రపంచకప్‌లో బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్‌తో సరిపెట్టుకుని స్వదేశానికి తిరుగుముఖం పట్టడంపై ఆ దేశ ఫుట్‌బాల్ సమాఖ్య సీరియస్ అయ్యింది. దీంతో డుంగాను తొలగించి, ఆతని స్థానంలో లూయిస్ ఫిలిప్‌ను కోచ్‌‌గా నియమించింది.

వెబ్దునియా పై చదవండి