యూఎస్ ఓపెన్ సెమీస్‌లో సెరెనా, క్లిజ్‌స్టెర్స్

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్స్ కంటే సెమీస్‌కు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే శుక్రవారం జరిగే సెమీస్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా), బెల్జియం అగ్రశ్రేణి క్రీడాకారిణి, మాజీ ఛాంపియన్ క్లిజ్‌స్టెర్స్ తలపడుతున్నారు. వీరిద్దరు తలపడే సెమీస్ మ్యాచ్ కోసం ఇప్పుడు టెన్నిస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఏడాది ఇప్పటికే రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు తన ఖాతాలో వేసుకున్న సెరెనా విలియమ్స్ ఇప్పుడు ఈ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఆమె ఖాతాలో ఇప్పటికే ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్ టైటిళ్లు ఉన్నాయి. మరోవైపు రెండేళ్ల విరామం తరువాత టెన్నిస్ కోర్టుల్లో అడుగుపెట్టిన క్లిజ్‌స్టెర్‌పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

క్లిజ్‌స్టెర్స్ యూఎస్ ఓపెన్ 2005 టైటిల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు క్రీడాకారిణిలు గత ఆరేళ్లలో ఒక్కసారి కూడా తలపడలేదు. సెరెనా విలియమ్స్ జోరుకు క్లిజ్‌స్టెర్స్ కళ్లెం వేయగలదని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ మరో సెమీస్ మ్యాచ్‌లో యానినా విక్‌మేయర్ (బెల్జియం), తొమ్మిదో సీడ్ డానే కరొలినే వోజ్నియాకీ తలపడనున్నారు.

వెబ్దునియా పై చదవండి