సిలిక్‌పై ప్రతీకారం తీర్చుకున్న సోమ్‌దేవ్

File
FILE
లెగ్ మాసన్ టెన్నిస్ క్లాసిక్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత టెన్నిస్ యువకెరటం సోమ్‌దేవ్ దేవవర్మన్ మరో సంచలనం సృష్టించాడు. గత ఏడాది జరిగిన చెన్నై ఓపెన్‌ ఫైనల్లో క్రవోషియా ఆటగాడు మారిన్ సిలిక్ చేతిలో తనకెదురైన పరాజయానికి.. ప్రస్తుతం జరుగుతున్న లెగ్ మాసన్ టెన్నిస్ టోర్నీలో ప్రతీకారం తీర్చుకున్నాడు.

ఈ టోర్నీ రెండో రౌండులో జరిగిన మ్యాచ్‌లో సిలిక్‌పై అద్భుతంగా పోరాడి 7-5, 6-4తో సోమ్‌దేవ్ గెలుపొందాడు. వీరిద్దరి మధ్య మ్యాచ్ సుమారు ఒక గంట 42 నిమిషాలకు పైగా సాగింది. కాగా, తన తర్వాత మ్యాచ్‌లో క్రవోషియాకు చెందిన ఇవో కార్లోవిక్ లేదా జర్మనీకి చెందిన రైనీ షియుట్లర్‌లతో తలపడవచ్చు.

మ్యాచ్ అనంతరం సోమ్‌దేవ్ విలేకరులతో మాట్లాడుతూ, సిలిక్‌పై విజయం తన కెరీర్‌లోనే అత్యుత్తమమైనదని వ్యాఖ్యానించాడు. టెన్నిస్ ర్యాంకుల్లో టాప్ 15లో ఉన్న ఆటగాడిపై గెలుపు సాధించడం తనకెంతో సంతృప్తినిచ్చిందని వివరించాడు. తర్వాతి మ్యాచ్‌లలోను మరింత కఠినంగా శ్రమిస్తానని.. మరింత మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తానని తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి