28 ఏళ్ళ తర్వాత స్వర్ణ 'యోగం'.. భారత రెజ్లర్ అదుర్స్!

సోమవారం, 29 సెప్టెంబరు 2014 (15:37 IST)
భారత్‌కు 28 సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా క్రీడల్లో భారత రెజ్లర్ యోగేశ్వర్ కుమార్ స్వర్ణ పతకాన్ని అందించాడు. ఆసియాడ్‌ రెజ్లింగ్‌లో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్‌ దత్‌ 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ పసిడి పతకం సాధించాడు. తద్వారా ఆసియాడ్‌లో తొమ్మిదో రోజు భారత్‌ స్వర్ణంతో సహా 8 పతకాలు సాధించింది. 
 
పురుషుల 65 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో అతను తజకిస్తాన్ రెజ్లర్ జలీంఖాన్ యుసుపోవ్‌ను 3-0 తేడాతో చిత్తుచేసి, చిరస్మరణీయ టైటిల్‌ను అందుకున్నాడు.
 
2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన యోగేశ్వర్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌ను ప్రదర్శించడంతో యుసుపోవ్ అతనికి ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయాడు.
 
1986 సియోల్ ఆసియా క్రీడల్లో కర్తార్ సింగ్ స్వర్ణ పతకం సాధించాడు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత భారత్‌కు మరో స్వర్ణాన్ని యోగేశ్వర్ అందించాడు. 2006 ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించిన అతను ఈసారి విజేతగా నిలవడం విశేషం.
 
ఇకపోతే.. ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ ‘టాప్-10'లో స్థానం సంపాదించింది. శనివారం 11 పతకాలను సాధించిన భారత్‌కు ఆదివారం ఒక స్వర్ణం, ఒక రజతం, ఆరు కాంస్యాలు సహా మొత్తం ఎనిమిది పతకాలు లభించాయి. ప్రస్తుతం భారత్ నాలుగు స్వర్ణం, ఐదు రజతం, 26 కాంస్యాలతో మొత్తం 35 పతకాలు సాధించి తొమ్మిదో స్థానంలో నిలిచింది.

వెబ్దునియా పై చదవండి