వెస్టిండీస్‌పై దావా వేయాలని నిర్ణయించిన బీసీసీఐ!

మంగళవారం, 21 అక్టోబరు 2014 (15:32 IST)
భారత పర్యటన నుంచి అర్థాంతరంగా నిష్క్రమించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై న్యాయపరమైన చర్యలతో పాటు.. ఈ పర్యటన రద్దు వల్ల వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు కరేబియన్ బోర్డుపై దావా వేయాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాదులో జరిగిన బోర్డు కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. 
 
మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన బీసీసీఐ... వెస్టిండీస్ పర్యటన రద్దు, శ్రీలంకతో వన్డే సిరీస్‌లపై చర్చించారు. ఇందులో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై దావా వేస్తామని వెల్లడించింది. అంతేగాక వెస్టిండీస్‌తో జరిగే అన్ని రకాల ద్వైపాక్షిక పర్యటనలను రద్దు చేసుకుంటున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. 
 
ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య ఐదు వన్డేలు, ఒక టి20, మూడు టెస్టులు జరగాల్సి ఉండగా, విండీస్ ఆటగాళ్లు, బోర్డు విభేదాల కారణంగా నాలుగో వన్డే అనంతరం టూర్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్‌లు జరగాల్సిన 17 రోజుల ఆదాయాన్ని (మూడు టెస్టులకు 15 రోజులు, ఒక వన్డే, ఒక టి20) బీసీసీఐ కోల్పోయింది. 
 
శ్రీలంక జట్టును ఐదు వన్డేల సిరీస్‌కు ఆహ్వానించి దీనిని పూరించేందుకు ప్రయత్నించినప్పటికీ, 12 రోజుల ఆదాయానికి గండి పడింది. విండీస్‌తో సిరీస్‌లో ప్రతీ మ్యాచ్ ద్వారా బోర్డుకు రోజుకు దాదాపు 33 కోట్ల రూపాయల ఆదాయం సమకూరేది. సిరీస్ రద్దు నేపథ్యంలో బీసీసీఐకి నష్టం 396 కోట్ల రూపాయలని పేర్కొంది. ఈ మొత్తం విండీస్ బోర్డు నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు డబ్ల్యుఐసీబీపై దావా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది.

వెబ్దునియా పై చదవండి