ఆసియా క్రీడలు.. చేతులెత్తేసిన పీవీ సింధు.. ఫైనల్లో తడబాటు

మంగళవారం, 28 ఆగస్టు 2018 (13:24 IST)
ఆసియా క్రీడల్లో భాగంగా బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు చేతులెత్తేసింది. చైనీస్ తైపీ ప్లేయర్ తై జు యింగ్ చేతిలో సింధు పరాజయం పాలైంది. దీంతో సింధు రజతంతో సరిపెట్టుకుంది. తొలి సెట్ నుంచి దూకుడుగా ఆడిన వరల్డ్ నెంబర్ వన్ యింగ్ 14-21, 16-21 తేడాతో సింధుపై అలవొకగా గెలిచి స్వర్ణం సాధించింది. 
 
ఫైనల్లో మెరుగ్గా ఆడినా.. పీవీ సింధు కాస్త తడబడింది. ఇంకా ఒత్తిడిలో సింధు పదే పదే తప్పులు చేసి అనవసరంగా యింగ్‌కు పాయింట్లు సమర్పించుకుంది. దీంతో సింధును మరోసారి ఫైనల్ ఫోబియా వెంటాడినట్లైంది. కాగా, ఈసారి హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సింధు, సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించారు. 1982 తర్వాత ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో తొలిసారి రెండు పతకాలు దక్కాయి. 
 
మరోవైపు ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడకారుల పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో భారత్ రజత పతకం సాధించింది. ఇండియన్ టీమ్‌ ముస్కన్ కిరార్, మధుమితా, జ్యోతి సురేఖలు సిల్వర్ మెడల్ సాధించారు. ఫైనల్లో దక్షిణ కొరియా చేతిలో భారత్ 228-231 స్కోర్‌తో పరాజయం పొందడంతో తృటిలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది. 
 
మరోవైపు పురుషుల ఆర్చరీ విభాగంలో కాంస్యం దక్కింది. ఇండియా పతకాల సంఖ్య 43కి చేరింది. వీటిలో 8 స్వర్ణం, 13 రజతం, 22 కాంస్యం ఉన్నాయి. 43 పతకాలతో భారత్ పతకాల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు