సానియా పేరును రాజీవ్ ఖేల్‌రత్నకు సిఫారసు చేసిన క్రీడాశాఖ

ఆదివారం, 2 ఆగస్టు 2015 (11:41 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును క్రీడా రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక ‘రాజీవ్‌ ఖేల్‌ రత్న’ అవార్డుకు కేంద్ర మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. అయితే తుది నిర్ణయం మాత్రం అవార్డుల కమిటీదేనని స్పష్టం చేసింది. డబుల్స్‌లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ అయిన సానియా.. స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలసి కెరీర్‌లో తొలి మహిళల డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ సాధించిన విషయం తెల్సిందే. 
 
క్రీడా రంగంలో సానియా సాధించిన ఘన విజయాలకుగాను కేంద్ర క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్‌.. ప్రతిష్టాత్మక అవార్డుకు ఆమె పేరును సిఫారసు చేసినట్టు క్రీడల శాఖ కార్యదర్శి అజిత్‌ శరణ్‌ తెలిపారు. ఆల్‌ ఇండియా టెన్నిస్‌ ఫెడరేషన్‌ (ఐటా) నుంచి ప్రతిపాదనలు ఆలస్యంగా అందినా.. మంత్రిత్వ శాఖ ఆమోదించి సానియా పేరును కమిటీకి సిఫారసు చేసిందని శరణ్‌ చెప్పారు. తుది నిర్ణయం అవార్డుల కమిటీదేనన్నారు. 

వెబ్దునియా పై చదవండి