కన్నుల పండువగా భద్రాద్రి రాముడి పట్టాభిషేకం!

సోమవారం, 2 ఏప్రియల్ 2012 (12:25 IST)
FILE
భద్రాచలంలో శ్రీరాముల వారి పట్టాభిషేకం కన్నులపండువగా జరిగింది. దేశంలోని పుణ్య నదీజలాలు ఒక్కచోటికి చేరుకోగా, వేదమంత్రాల సాక్షిగా రాముడు పట్టాభిషిక్తుడైనాడు. ఈ అపురూప దృశ్యాన్ని కనులారా చూసి తరించేందుకు భారీ స్థాయిలో భక్తులు తండోపతండాలుగా భద్రాచలానికి చేరుకున్నారు. భక్తులు చేస్తున్న శ్రీరామ నామ స్మరణతో భద్రాద్రి కొండ మారుమోగిపోతోంది.

అంతకుముందు భద్రాద్రి రాముడికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పట్టువస్త్రాలు సమర్పించుకున్నారు. పట్టాభిషేకం కోసం దేశంలోని గంగా, యమున, సరస్వతి, కృష్ణా, కావేరి, తుంగభద్ర నదుల నుంచి పుణ్య జలాలను భద్రాద్రికి తీసుకువచ్చారు.

ఇదిలా ఉంటే.. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం చలువ పందిళ్లు, వేద పండితుల మంత్రోచ్ఛారమల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

నందన నామ సంవత్సరం చైత్రశుద్ధ మాసం ఆదివారం అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. మరోవైపు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం ఆదివారం ఘనంగా జరిగింది.

వెబ్దునియా పై చదవండి