తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి చేపట్టనున్నారు. ఈ ఎన్నికల ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ సర్వత్రా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి ఫలితం ఎక్కడ నుంచి వెలువడుతుంది? ఏ కేంద్రం నుంచి వెలువడుతుంది? అన్నదానిపై కూడా ఆసక్తి నెలకొనివుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఓట్ల లెక్కింపును పరిశీలిస్తే, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 161 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపు 14 టేబుళ్లపై జరుగనుంది. దీంతో ఉదయం 11.30 గంటల లోపే భద్రాచలం నుంచి తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది.
అలాగే, చాలా ఆలస్యంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి వెలువడనుంది. ఇక్కడ గరిష్టంగా 580 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. దీంతో ఈ నియోజకవర్గ ఫలితం మిగతా వాటితో పోల్చితే ఆలస్యంగా వెలవడనుంది.