తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలు నయా ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకునేందుకు వివిధ రకాలుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా, ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నో ఆకర్షణీయమైన హామీలు గుప్పిస్తున్నారు. అదేసమయంలో యువ ఓటర్లను ఆకర్షించేందుకు కూడా సరికొత్త కానుకలు ఇస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని దాదాపు ఆరేడు నియోజకవర్గాల్లో వేలాది సెల్ ఫోన్ల పంపిణీ జరుగుతోంది. ఫోన్లను ఒక్కసారి కొంటే.. అధికారులు ఆరా తీసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అనుచరులకు డబ్బిచ్చి వారితోనే ఆన్‌లైన్‌లో బుక్ చేయిస్తున్నారు. తమ సోంత కార్యకర్తలకేకాకుండా పక్క పార్టీలో పేరున్న కార్యకర్తలకు.. సెల్‌ఫోన్‌తో పాటు 50 వేల నగదును అందజేస్తున్నారని తెలుస్తుంది. గల్లీలోని పెద్ద లీడర్లకు 5 లక్షల నుండి 15 లక్షల వరకు ఎన్నికల నిర్వహణ ఖర్చుల కింద నగదును ఇప్పటికే చేరవేసినట్టు సమాచారం.