తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగ్గజాలను తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురిచూసి దెబ్బకొట్టారు. మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉద్ధండ నేతలు మట్టికరిచారు. ఇలాంటివారిలో రేవంత్ రెడ్డి, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి వారు ఉన్నారు.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని, అసెంబ్లీలో మైక్ విసిరిన ఘటనలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ను ఓడించారు. ముఖ్యంగా, పంటికింద రాయిలా మారిన రేవంత్ రెడ్డిని ఓడించాలని కేసీఆర్ రెండేళ్ళ క్రితమే కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని ఎంతో ముందుగానే కొడంగల్ అభ్యర్థిగా ప్రకటించారు. రేవంత్ రెడ్డి మేలుకుని కొడంగల్‌కు తిరిగి వచ్చేసరికే అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అలాగే, నల్లగొండ జిల్లాలో బలమైన నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, మహబూబ్ నగర్‌లో సంపత్‌కూ తొలిరోజుల్లో టీఆర్‌ఎస్ వల వేసిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకే సిద్ధపడ్డారన్న కథనాలు వచ్చాయి. వీరిద్దరీ ఓడించారు. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెరాసకు కొరకరాని కొయ్యిలా ఉన్న జీవన్ రెడ్డిని కూడా ఓడించారు.
ఇకపోతే, కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన డీకే అరుణను ఓడించేందుకు.. గతంలో ఆమెకు అండదండగా ఉన్న ఆమె మేనల్లుడు కృష్ణమోహన్ రావుకు తెరాస టిక్కెట్ ఇచ్చి ఆమెను వేల మెజార్టీ ఓట్ల తేడాతో ఓడించారు. హరీశ్ రావు విస్తృత ప్రచారంలో గద్వాల్ జేజెమ్మ ఓడిపోక తప్పలేదు. ఒక్క జగ్గారెడ్డి మాత్రం అష్ట దిగ్బంధం నుంచి తప్పుకొని విజేతగా నిలిచారు.