తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ మల్లగుల్లాలు: కేసీఆర్
శుక్రవారం, 13 జనవరి 2012 (18:21 IST)
FILE
తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణలో పుట్టగతులుండవని కాంగ్రెస్ పార్టీకి తెలిసిపోయిందనీ, అందువల్ల రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు మల్లగుల్లాలు పడుతోందని తెరాస చీఫ్ కేసీఆర్ అన్నారు. తనకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని రేపే ఇస్తే రేపే తీసుకుంటామనీ, ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో ఇస్తే అప్పుడే తీసుకుంటామన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించి ఫిబ్రవరిలోగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ పౌరులకు రాష్ట్ర ఏర్పాటుతోనే న్యాయం జరుగుతుందన్నారు. లేదంటే ఈ సీమాంధ్ర పాలకులు దోచుకుంటూనే ఉంటారన్నారు. తెలంగాణాకు అడ్డంపడ్డ తెలుగుదేశం పార్టీ ఇక్కడ పూర్తిగా భూస్థాపితం కాబోతోందన్నారు. ఇక ఆ పార్టీకి ఇక్కడ నూకలు చెల్లినట్లేనని చెప్పుకొచ్చారు.
ఇటీవల తన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల కథనాలు వస్తున్నాయన్నారు. నాకు ఏదో పెద్ద రోగం ఉన్నదని దుష్ప్రచారం జరుగుతోందనీ, ఏడాదిలో తాను చనిపోతే చూడాలని చాలామంది ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు కేసీఆర్. ఐతే తెలంగాణ సాధించేవరకూ నన్ను ఏ శక్తీ ఆపలేదనీ, ఎంత దుష్ప్రచారం చేసినా అంతకు రెట్టింపు శక్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుక వెళతామని అన్నారు.