తెలంగాణ కోసం మరోసారి కేసీఆర్ దీక్ష చేయనున్నారా..?!

సోమవారం, 24 అక్టోబరు 2011 (19:55 IST)
FILE
తెలంగాణలో సకలజనుల సమ్మె నుంచి ఉద్యోగ జేఏసీలు ఒక్కొక్కటి తమ సమ్మెను వాయిదా వేస్తూ వెళుతున్నాయి. దాదాపు 40 రోజులపాటు సమ్మె సాగించిన ఉద్యోగలు మరో రెండు రోజుల్లో దీపావళి పండుగకు చేతిలో చిల్లిగవ్వ లేక నానా యాతన పడుతున్నారు.

దీంతో వారికి కుటుంబసభ్యుల నుంచి వ్యతిరేకత తప్పడం లేదు. వారికి ఎలాగోలా సర్దిచెప్పి సమ్మె కొనసాగించినా ఇప్పటికిప్పుడు తెలంగాణా ఏర్పాటు సాధ్యమయ్యే పరిస్థితి లేదు. దీంతో భారాన్ని తిరిగి రాజకీయ నాయకులపైనే పెడుతూ ఉద్యోగులు సమ్మెను వాయిదా వేసుకునేందుకు సిద్ధమయ్యారు.

ఇదిలావుంటే తెలంగాణ ఉద్యోగ జేఏసీతో తన లక్ష్యాన్ని సాధించుకుందామనుకున్న కేసీఆర్ ఇపుడు మళ్లీ ఆలోచన పడ్డారు. ఉద్యోగులు వెనక్కి తగ్గుతున్న ప్రస్తుత స్థితిలో ఇదే వేడిని కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో తెరాస ఎమ్మెల్యేలతో కేసీర్ సమావేశమై భవిష్యత్ లో అనుసరించాల్సినదానిపై వ్యూహరచన చేశారు.

నవంబరు 1 నుంచి ఇందిరాపార్కు వద్ద నిరవధిక నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అవసరమైతే కేసీఆర్‌తో మరోసారి దీక్షకు దిగాలని వారు తలపోసినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే ఆమధ్య ఉద్యోగ జేఏసీతో ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ వారిని ఇంటికి పంపించి ఒక్కరోజు ఢిల్లీలో ఉండి ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారని తెదేపా నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.

పోలవరం టెండర్లను దొడ్డిదోవన దక్కించుకుని కోట్లకొద్దీ డబ్బు సంచులు వెనకేసుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఈ పోలవరం సమస్యను పక్కదోవ పట్టించేందుకు దీక్షను తెరపైకి తెస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

వెబ్దునియా పై చదవండి