తెలంగాణపై సీమాంధ్రులను కూడా ఒప్పించి...: ప్రధాని

సోమవారం, 3 అక్టోబరు 2011 (20:26 IST)
FILE
తెలంగాణ సమస్యపై కాంగ్రెస్ పార్టీ నేతలే రాజీనామాకు సిద్ధమవుతుంటే ఇంకా తాత్సారం తగదని కేసీఆర్, జేఏసీ నేతలు సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు విన్నవించారు. తెలంగాణలో ప్రజలు దసరా పండుగ చేసుకునే పరిస్థితి కూడా లేదనీ, కనుక వెనువెంటనే తెలంగాణపై ఓ నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు.

కేసీఆర్, జేఏసీ నేతల విన్నపాలను సావధానంగా ఆలకించిన ప్రధానమంత్రి మన్మోహన్ స్పందిస్తూ... తెలంగాణ తెలంగాణ ఉద్యమ తీవ్రత తమకు తెలుసునని అన్నారు. ప్రజల్ని కష్టాలు పాల్జేస్తున్న సకలజనుల సమ్మెను సత్వరమే విరమించేలా ఉద్యోగుల్ని ఒప్పించాలని కోరారు.

రైతులకు పంట నష్టాన్ని తెస్తున్న కరెంటు ఇబ్బందులు లేకుండా చూడాలని కేసీఆర్, జేఏసీ నేతలతో ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణకోసం యువకులు బలిదానాలకు పాల్పడటం విషాదకరమని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు తమకు మరికొంత వ్యవధి కావాలనీ, ఐతే ఈ సమస్యపై సీమాంధ్రులను కూడా ఒప్పించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాన్ని కనుగొంటామని చెప్పినట్లు సమాచారం.

ఏదేమైనప్పటికీ తన దృష్టికి వచ్చిన విషయాలన్నిటినీ కోర్ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని ప్రధాని చెప్పారు. మొత్తమ్మీద ప్రధాని వద్ద నుంచి తెలంగాణపై స్పష్టమైన హామీ అయితే ఏదీ రాలేదు. ఇంకోవైపు తెరాస అధినేత కేసీఆర్, జేఏసీ బృందం అంతా కలిసి విపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఇంటికి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో జాతీయ నాయకులతో సమావేశమై తెలంగాణ ఉద్యమ తీవ్రతను తెలియజేయడం ద్వారా లక్ష్యాన్ని సాధించుకోవాలని కేసీఆర్ తీవ్రంగా యత్నిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి