తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల సర్వే: 100 సీట్లొస్తాయని ధీమా

గురువారం, 8 డిశెంబరు 2011 (20:15 IST)
తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడప్పుడే తేల్చేట్లు కనబడకపోవడంతో కేసీఆర్ తనదైన వ్యూహాల్లో మునిగిపోతున్నారు. కిరణ్ ప్రభుత్వం ప్రస్తుతానికి గట్టెక్కినా... ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణపై కాంగ్రెస్ తగు నిర్ణయం తీసుకోనట్లయితే కిరణ్ సర్కార్‌ను పడగొట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం.

తెలంగాణ ప్రాంతంలో మరోసారి ఉద్యమ వేడిని రగిల్చి తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం. ఇప్పటికే ఆయన ఈ కోణంలో పలు వ్యూహాలను పన్నుతున్నట్లు భోగట్టా.

మరోవైపు తెలంగాణ ప్రాంత తెలుగుదేశం తమ్ముళ్లు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఇక తాము కూడా రాజీనామాలు చేసి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెస్తే కచ్చితంగా వారు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుందనీ, ఫలితంగా కిరణ్ సర్కార్ కూలిపోతుందనే అంచనాల్లో తెరాస నాయకులు ఉన్నట్లు సమాచారం.

అలా కూలగొట్టిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు వెళితే తెరాస 100 సీట్లకు పైగా సాధించడం ఖాయమని ఇటీవల కేసీఆర్ చేయించిన సర్వేల్లో తేలిందట. ఇపుడా ఫలితాలను చేతబట్టుకుని వచ్చిన నాయకులందరికీ చూపిస్తూ ఉత్సాహాన్ని కలిగిస్తున్నారట కేసీఆర్. ఎన్నికల్లో 100 సీట్లు వస్తే తెలంగాణ తన్నుకుంటూ వస్తుందని ఆయన తన సహచర నాయకులతో చెపుతున్నారట.

ఎటూ సీమాంధ్రలో జగన్ సింహభాగం స్థానాలను కైవసం చేసుకుని మొదటి వరసలో ఉంటారు కనుక రెండు పార్టీలో ఓ అవగాహనకు వచ్చి రాష్ట్ర విభజన చేయవచ్చన్న ఆలోచనలో తెరాస ఉన్నట్లు చెబుతున్నారు. మరి కేసీఆర్ సర్వే ఫలితాలు నిజరూపం దాల్చుతాయో లేదో చూడాలి.

వెబ్దునియా పై చదవండి