రెండు పొరుగు గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులను ఓ యువకుడు ప్రేమించాడు. చివరకు ఆ ఇద్దరు యువతులతో పాటు వారి కుటుంబ సభ్యులను ఒప్పించి ఇద్దరు యువతులను పెళ్లాడాడు. ఈ ఆసక్తికర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
జిల్లాలోని లింగాపూర్ మండలం ఘమనూర్ గ్రామానికి చెందిన సూర్యదేవ్ అనే యువకుడు పక్కపక్క గ్రామాలకు చెందిన యువతులు లాల్‌దేవి, జల్కర్‌దేవిలను ఒకేసారి ప్రేమించాడు. కొంతకాలంగా ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగిస్తున్నాడు.
ఈ విషయం తెలిసిన గ్రామస్థులు, ఆదివాసీ పెద్దలు కలిసి ఇరు కుటుంబాలతో పాటు ఇద్దరు యువతులతోను మాట్లాడారు. యువతులు ఇద్దరూ సూర్యదేవ్‌ని పెళ్లి చేసుకునేందుకు సమ్మతించారు. ముగ్గురం కలిసి జీవిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారికి వివాహం చేయాలని ఆదివాసీ పెద్దలు నిర్ణయించడంతో గురువారం ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఘనంగా వివాహం జరిపించారు.