నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి - ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ

మంగళవారం, 26 డిశెంబరు 2023 (06:16 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం (డిసెంబరు 26)న ఢిల్లీకి వెళుతున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు చేరుకుంటారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆయన తొలుత ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణాకు సంబంధించి అనేక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 
 
సాధారణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వెళ్లి ప్రధాన మంత్రిని కలవడమన్నది సంప్రదాయం. దీన్ని రేవంత్‌ కూడా కొనసాగించనున్నారు. వాస్తవానికి రాజకీయ వైరుధ్యాలతో సంబంధం లేకుండా.. కేంద్ర ప్రభుత్వంతో పాలనా పరమైన సఖ్యతను సీఎం రేవంత్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఈ మేరకు గతంలోనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి స్వయంగా ఫోన్‌ చేసి తాను మర్యాదపూర్వకంగా కలిసేందుకు ప్రధాని మోడీ వెసులుబాటు గురించి ఆరా తీశారు. 
 
ఈ నెల 26 (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు కలిసేందుకు ప్రధాని సమయం ఇచ్చారు. కాగా, ప్రధానితో సీఎం భేటీ మర్యాదపూర్వకమేనన్న అభిప్రాయాలున్నప్పటికీ.. ఈ సందర్భంగా రేవంత్‌ రాష్ట్ర ప్రయోజనాలను మోడీ దృష్టికి తీసుకెళతారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 'ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014'లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతోపాటు ఇతర హామీలను నెరవేర్చాలని కోరనున్నారు.
 
 
ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో సమావేశమవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు, తెలంగాణ అప్పులు, ఆస్తులు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించిన విషయం తెల్సిందే. 

 
అధికారం లేక నిద్ర పట్టడం లేదా? - భారసాకు బండ్ల గణేశ్‌ కౌంటర్ 
 
తెలంగాణాలో అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితికి సినీ నిర్మాత బండ్ల గణేశ్ తేరుకోలేని కౌంటర్ ఇచ్చారు. అధికారం లేక నిద్రపట్టడం లేదా అంటూ విమర్శించారు. గత పాలకులు అంటూ ఎంత కాలం చెబుతారు... పదేళ్లలో మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి...! కాంగ్రెస్‌ అధికారం చేపడితే.. మీకు నిద్ర పట్టడం లేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. 
 
పవర్‌ లేని వాళ్లకు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఎందుకు సార్‌.. అంటూ భారస నేతలను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఆదివారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ప్రజాస్వామ్యం గొప్పది. మీరు బాగా చేయలేదని మాకు అధికారం ఇచ్చారు. కాంగ్రెస్‌ వచ్చి నెల రోజులు కూడా కాలేదు. ఆగండి.. ఓపిక పట్టండి. నిద్ర వస్త లేదా? 
 
మీరు చేసిన తప్పులు బయటకు వస్తాయని భయపడుతున్నారా? అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందనా? ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉన్నారనా? అనుక్షణం అందరికీ న్యాయం చేస్తున్నారనా? ప్రజలు సుఖ సంతోషాలతో కళకళలాడుతున్నారనా? ఎందుకు మీకు తొందర.. ఆగండంటూ హితవు పలికారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు