తెలంగాణలో 24 గంటల జనతా కర్ఫ్యూ

శనివారం, 21 మార్చి 2020 (16:04 IST)
తెలంగాణలో జనతా కర్ఫ్యూ 24 గంటల పాటు కొనసాగనుంది. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన రేపటి (ఆదివారం) జనతా కర్ఫ్యూకు అందరూ సహకారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు.

ఆదివారం ఉదయం 6 గంటలనుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24గంటల పాటు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు తిరగవని చెప్పారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను రాష్ట్రంలోకి అనుమతివ్వమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. షాపులు, మాల్స్‌ స్వచ్ఛందంగా మూసివేయాలన్నారు. వ్యాపార, వర్తక సంఘాల ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరారు.  700 మందికి పైగా కరోనా అనుమానితులకు పరీక్షలు చేశామని కేసీఆర్‌ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు.

ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైందని, విదేశాల నుంచి వచ్చే వారితోనే సమస్య వస్తోందని చెప్పారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 20 వేల మందికి పైగా వచ్చారని తెలిపారు. కరీంనగర్‌ ఘటన తర్వాత కలెక్టర్ల సమావేశం పెట్టామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అనేది తెలియడం లేదన్నారు.

11 వేల మందిని గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నామని, 5,274 నిఘా బృందాలను ఏర్పాటు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై 14 రోజుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. ‘‘అందరూ బయటి దేశాల నుంచి వచ్చిన వారే.

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్‌పోస్ట్‌లు, 78 జాయింట్‌ టీమ్‌లను ఏర్పాటు చేశాం. అంతర్జాతీయ పరిణామాలను పర్యవేక్షించేందుకు ఐదుగురితో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు