పెట్రోల్ - డీజిల్ ధరపై నయాపైసా తగ్గించం : సీఎం కేసీఆర్

ఆదివారం, 7 నవంబరు 2021 (21:21 IST)
పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్రం వసూలు చేస్తున్న వ్యాట్ పన్నుల్లో నయాపైసా తగ్గించే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ధరల భారాన్ని కేంద్రమే తగ్గించాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా పెంచుకుంటూ పోయిందని గుర్తుచేశారు. ఇపుడేమో రూ.5, రూ.10 చొప్పున తగ్గించి చేతులు దులుపుకుందన్నారు. కానీ, ఆయా రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నేతలు మాత్రం రాష్ట్రాల్లో వ్యాట్ పన్నును తగ్గించాలని డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఆదివారం రాత్రి ఆయన ప్రగతి భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పెట్రో ధరలపై ఆయన స్పందిస్తూ, పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం అద్భుతమైన పద్ధతిలో అబద్ధం చెప్పిందని అన్నారు. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిందని, అప్పటినుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర 105 డాలర్లకు మించలేదని తెలిపారు.
 
ఓసారి చమురు ధరలు కుప్పకూలి 30 డాలర్లకు కూడా పడిపోయిందని, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని, రష్యాలోనూ అలాంటి పరిస్థితే వచ్చిందని వివరించారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయంగా ధర పెరిగిందని అబద్ధాలు చెప్పిందని ఆరోపించారు. 
 
రాష్ట్రాల వాటా ఎగ్గొట్టేందుకు ట్యాక్సులు పెంచకుండా, దాన్ని సెస్ రూపంలోకి మార్చారని వివరించారు. ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నారని, అందుకే, ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఏకంగా లక్షలాది రూపాయలు వెచ్చించి పత్రికా ప్రకటన కూడా ఇచ్చారని గుర్తుచేశారు. 
 
"నాడు పెట్రోల్ ధర రూ.77 ఉంటే దాన్ని రూ.114 చేశారు. డీజిల్ ధర రూ.68 ఉంటే రూ.107 చేశారు. ఈ పెరుగుదల మొత్తం కేంద్రమే తీసుకుంటోంది. రాష్ట్రాల నోరుకొడుతున్నారు. ప్రజలకు అబద్ధాలు చెబుతూ, మోసం చేస్తూ భారం మోపుతున్నారు. దానికితోడు రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఎగ్గొడుతున్నారు. ఇప్పుడు పలు రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో కంటితుడుపు చర్య కింద ఎక్సైజ్ సుంకం ఓ పది రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇదే ఓ ఘనకార్యం అన్నట్టు చెప్పుకుంటున్నారు. పెంచింది కొండంత, తగ్గించింది పిసరంత!
 
ఇంత మోసం చేసి, ఇప్పుడు రాష్ట్రాలు కూడా తగ్గించాలని చెబుతున్నారు. తగ్గించకపోతే ధర్నాలు చేస్తామని బీజేపీ వాళ్లు అంటున్నారు. ఎవరు ధర్నాలు చేయాలి? మీరా? మేమా? ఇప్పుడు మేం డిమాండ్ చేస్తున్నాం... చమురు ధరలపై మొత్తం సెస్‌ను కేంద్రం ఉపసంహరించుకోవాలి. ప్రజల మీద అంత ప్రేమే ఉంటే 2014 నాటి ధర రూ.77కే ఇవాళ కూడా ఇవ్వొచ్చు" అని స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు