1897 సెక్షన్ మేరకు లాక్‌డౌన్.. పగటిపూట బయటకొస్తే అంతేమరి...
సోమవారం, 23 మార్చి 2020 (19:05 IST)
తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేయనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ లాక్‌డౌన్ అమలుకు ఆదేశించారు. దీన్ని 1897 సెక్షన్ ప్రకారం అమలు చేస్తున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపునిచ్చారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఇప్పటికే ఇతర రాష్ట్రాల సరిహద్దులను మూసివేశామని తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చామన్నారు.
ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు 8 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా సివిల్ సైప్లె కమిషనర్, రవాణా శాఖ కమిషనర్, హైదరాబాద్ పోలీస్ ఐజీ, డ్రగ్ కంట్రోలర్ డైరెక్టర్, హార్టిక్చర్ డైరెక్టర్, మార్కెటింగ్ డైరెక్టర్, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్, డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ ఉండనున్నారు.
ఈ లాక్‌డౌన్ కాలంలో కొన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా, ద్విచక్రవాహనంపై ఒకరు, ఫోర్ వీలర్స్‌పై ఇద్దరికీ మించి ప్రయాణించడానికి వీల్లేదన్నారు. అలాగే, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయటకు రాకూడదని ఆదేశించారు.
అత్యవసర వైద్యచికిత్స కోసం మినహా ఎవరూ బయటకు రాకూడదన్నారు. సాయంత్రం 6.30 గంటల తర్వాత అన్ని దుకాణాలు, సంస్థలు మూసివేస్తామని తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత నిత్యావసర వస్తువులు ఇవ్వరని తెలిపారు. తమ నివాస ప్రాంతం నుంచి 3 కిలో మీటర్ మేర ప్రయాణానికి అనుమతి ఉంటుందని తెలిపారు.
ఈ లాక్‌డౌన్ సమయంలో తెరిచివుంచే షాపుల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించడంతో.. ఏయే సేవలు అందుబాటులో ఉంటాయో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవోను విడుదల చేసింది.
31వ తేదీ వరకు కిరణా దుకాణాలు, మెడికల్ షాపులు, సూపర్ మార్కెట్లు, కూరగాయలు, పాల దుకాణాలు, చికెన్, మటన్, చేపల మార్కెట్లు, బ్యాంకులు, పోస్టు ఆఫీసులు, పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ ఏజెన్సీలు, ఫైర్ సర్వీస్ కేంద్రాలు తెరిచివుంటాయని పేర్కొంది.
అలాగే, టీ, టిఫిన్ సెంటర్లు, సెలూన్ షాపులు, బట్టల దుకాణాలు, బంగారం, ఫ్యాన్సీ, గాజులు, టైలరింగ్ షాపులు, ఎలక్ట్రికల్ వస్తువుల దుకాణాలు, టాయ్స్ షాపులు, విద్యా సంస్థలు మూసివుంటాయని ప్రభుత్వం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.