దళిత బంధు కోసం మార్గదర్శకాలు రిలీజ్..

శుక్రవారం, 6 ఆగస్టు 2021 (14:25 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల్ల దళిత బంధు ఒకటి. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తొలుత హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ తలపెట్టినా.. కోర్టు కేసుల నేపథ్యంలో దత్తత గ్రామం వాసాలమర్రిలో అమలు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక మార్గదర్శకాలు విడుదల చేసింది. 
 
జిల్లా, మండలం, గ్రామ స్థాయిల్లో కమిటీలను నియమించి ఈ పథకం అమలును పర్యవేక్షించనున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం నిర్ధేశించిన కమిటీలే దళిత బంధు పథకం అమలులో కీలకంగా వ్యవహరించనున్నాయి. పథకంపై అవగాహన సదస్సులు నిర్వహించడం, డేటాబేస్‌లో అర్హత కలిగిన కుటుంబాల పేర్లు నమోదు చేయడం, జిల్లా కలెక్టర్‌ నుంచి మంజూరు పత్రాల పంపిణీ, లబ్ధిదారులకు శిక్షణ, అవసరమైన వనరుల కూర్పు, సలహాలు, సూచనలివ్వడం, క్యూఆర్‌ కోడ్‌లతో కూడిన ఐడీ కార్డుల జారీ, యూనిట్ల పనితీరు పరిశీలన, ఇన్సూరెన్స్‌ కవరేజీ తదితర అంశాలను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి.
 
మండల, గ్రామ కమిటీలు లబ్ధిదారులతో ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తాయి. వారితో చర్చించి.. సమస్యలేమైనా ఉంటే గుర్తించడం, వాటికి పరిష్కారం చూపడం వంటి చర్యలు తీసుకుంటాయి. ఈ సమావేశాలు, చర్చల నివేదికలను డేటాబేస్‌లోకి అప్‌లోడ్‌ చేస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు