తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్)లో రిజిస్ట్రేషన్ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నిజానికి ఈ గడువు గురువారంతో ముగియనుండగా, తాజాగా ఈ నెల 24వ తేదీకి పొడిగించారు. గురువారం మధ్యాహ్నం వరకు 1,40,581 మంది విద్యార్థులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఈసారి ఇంటర్‌లో 4.73 లక్షల మంది ఉత్తీర్ణులు అయినా రిజిస్ట్రేషన్లు బాగా తగ్గాయి. కరోనా, వర్షాలు, విద్యుత్ అంతరాయాలు తదితర కారణాల వల్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయని భావిస్తున్న అధికారులు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. 31 నుంచి సీట్లు కేటాయిస్తారు.
స్పెషల్ కేటగిరీ (దివ్యాంగులు, ఆర్మీ పిల్లలు, ఎన్‌సీసీ తదితర) విద్యార్థులు ఆగస్టు 6న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తిచేయించుకోవాలని, ఆగస్టు 14 నుంచి రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.