చంద్రబాబు మళ్లీ లేస్తడా, ఆ మంత్రులతో కలిసి ఏడ్చిన రోజులుండె: ఈటెల రాజేందర్

ఆదివారం, 16 మే 2021 (16:35 IST)
ప్రజాస్వామ్యంలో ఆత్మగౌరవం ప్రధానం, అదే తనకు లేకుండా పోయిందని మాజీమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఓ వార్తా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలా వున్నాయి.
 
''ప్రజాస్వామ్యం అంటే గౌరవం వుండాలె. కరీంనగర్ జిల్లాలో ఓ సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ వద్దకు నా సహచరులతో కలిసి పోయాం. మమ్మల్ని గేటు వద్దే ఆపేసిండ్రు. ఆరోజే నా ఆత్మగౌరవం దెబ్బతింది. కేసీఆర్ ఇంట్లోకి ఎలాంటి అపాయిట్మెంట్ లేకుండా పోయేటోడ్ని. గేటు దగ్గరే ఆపడంపై ఆరోజు నాతో వున్న చాలామంది బాధపడిండ్రు.
 
ముఖ్యమంత్రి తర్వాత నా కొడుకే సీఎం అనే పద్ధతి చెల్లుబాటు కాదు. రాజకీయాల్లో అస్సలు సాధ్యం కాదు. ప్రజల్లో విశ్వాసం వుండాలె. అప్పుడు దానంతట అదే వస్తది. ఏపీలో చంద్రబాబును చూడలేదా, కొడుకునే ముందు పెట్టిండు, మళ్లీ లేస్తడా.
 
జుహారాబాద్‌లో నన్ను వంచడం ఎవరితరం కాదు. రాజకీయ నాయకులు అటుఇటూ వంగుతారేమో కానీ ప్రజలు చాలా బంలంగా వుంటారు. వాళ్లు ఏమనుకుంటారో అదే చేస్తరు. నన్ను మంత్రి పదవి నుంచి ఏదో కట్టుకథ అల్లి తీసేయాల్సిన అవసరంలేదు. నచ్చకపోతే పదవి నుంచి తప్పించవచ్చు.
 
ఎన్ని లక్షల అసైన్డ్ భూములను ఇవ్వలేదు. నన్ను పదవి నుంచి తప్పించడానికి అదా కారణం. కానేకాదు. వాళ్ల వ్యూహం ప్రకారం నన్ను తీసేసిండ్రు. మొదటి దఫా పాలనలో పర్వాలేదు కానీ రెండోసారి మాత్రం ఎవ్వరకీ మనశ్శాంతి లేకుండె.
 
ఈటెల, హరీశ్ మంత్రి పదవులు ఇవ్వకూడదని ప్లాన్ చేసారు. కానీ తప్పక ఇవ్వాల్సి వచ్చి ఇచ్చిండ్రు. ఈ రెండున్నర సంవత్సర కాలంలో ఎవ్వరికీ ప్రశాంతత లేదు" అని చెప్పారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు