ఈ నెల 4న ఈటల రాజేందర్ టిఆర్‌ఎస్‌కు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మంచిరోజు చూసుకుని ఢిల్లీకి వచ్చి బిజెపిలో చేరతానని ఈటల రాజేందర్ అన్నట్లు సమాచారం. భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడానికి ఈటల రాజేందర్ ఈ నెల 4న విలేకరులతో సమావేశం కానున్నారు. ఆయనతో సహా మొత్తం అయిదుగురు నేతలు బిజెపిలో చేరనున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు వెల్లడించారు.
గత సోమవారం జెపి నడ్డాను, మంగళవారం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ ఛుగ్‌ని, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని ఈటల రాజేందర్ కలిశారు. నిన్న మరోసారి జాతీయ నాయకత్వంతో సమావేశమయ్యారు. ఏనుగు రవీందర్‌రెడ్డిలు ఛుగ్, మాజీ ఎంపి జి.వివేక్‌తో కలిసి ఆ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్‌తో సాయంత్రం ఈటల రాజేందర్ సమావేశమయ్యారు.
ఆ సమావేశంలోనే ఈటల రాజేందర్ తాను బిజెపిలో చేరతానని వెల్లడించినట్లు సమాచారం. సంతోష్ మాట్లాడుతూ... రానున్న రోజుల్లో తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజేందర్, రవీందర్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
ఇదిలావుంటే, తమ పార్టీ నియమావళి ప్రకారం, ఏ నాయకుడైనా పదవికి రాజీనామా చేసిన తర్వాతే చేరాల్సి ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ఈటల రాజేందర్ సైతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే తమ పార్టీలో చేరుతారని స్పష్టం చేశారు.