మార్మోగుతున్న ఈటల పేరు.. నేడు విజయోత్సవ ర్యాలీ

శనివారం, 6 నవంబరు 2021 (14:21 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈటల రాజేందర్ పేరు మార్మోగిపోతోంది. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు.. తన మంత్రిపదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. ఇటీవల హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగి ఉప ఎన్నికల్లో విజయభేరీ మోగించారు. దీంతో ఈటల పేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిపోతోంది. 
 
ఈ ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చి అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఈటల గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే, ఉపఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఈటల అడుగుపెట్టబోతున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. హుజురాబాద్ ఉపఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ పేరిట శనివారం ర్యాలీ చేపట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శామీర్‌పేట్‌లోని తన నివాసం నుంచి ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. శామీర్‌పేట్, తుమ్మికుంట, అల్వాల్, ప్యారడైజ్, రాణిగంజ్, గన్‌పార్క్ మీదుగా బీజేపీ కార్యాలయానికి ఆయన చేరుకుంటారు. 
 
తొలుత ఆయన గన్‌పార్క్‌కు చేరుకొని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్తారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి పార్టీ కార్యాలయానికి వస్తున్న ఈటలకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు