అసలు దొంగలు దొరికారు.. జర్నలిస్టులూ డ్రగ్ రాయుళ్లేనట.. వాళ్ల కుటుంబాలనూ లాగాలా?
శుక్రవారం, 21 జులై 2017 (06:07 IST)
ఇన్నాళ్లూ సినిమా రంగానికే చుట్టుకున్నదనిపించిన డ్రగ్స్ మహమ్మారి జర్నలిస్టులను, ఒక పత్రికాధిపతిని కూడా చుట్టుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు పూరీ జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యాం కె నాయుడిని ఎక్సైజ్ సిట్ అధికారులు విచారించినప్పుడు వారు బయటపెట్టిన సమాచారం చాలామంది మెడకు తగులుకుంటున్నట్లు సమాచారం. ఇక్కడా అదే కథ.. మేమే దొరికామా.. వాళ్లు తీసుకోలేదా, వీళ్లు తీసుకోలేదా.. అంటూ మొత్తంగా ఎవరెవరు మాదకద్రవ్యాలను వాడుతున్నారో గుట్టు బయట పెట్టడంతో సిట్ అధికారులు నివ్వెరపోయినట్లు తెలుస్తోంది.
సిట్ బృందం ఎంత పకడ్బందీగా ప్రశ్నలు వేస్తోందంటే సమాధానాలు తప్పించుకోవడం సాధ్యంకాకపోగా అదనపు సమాచారాన్ని కూడా అనుకోకుండానే వారు బయటపెడుతున్నట్లుంది. అందుకే గోవా మార్గం పట్టింది ఒక్క సినీ జనాలే కాదని, మరిన్ని రంగాలకు చెందిన వారున్నారని సిట్ పసికట్టగలిగింది. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యాం కె నాయుడిని ఎక్సైజ్ సిట్ అధికారులు విచారించినప్పుడు, శరపరంపరగా కురిపిస్తున్న ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిన వారు.. ‘‘వారు గోవా వెళితే తప్పులేదా’’ అంటూ ఎదురు సమాధానమిచ్చినట్లు తెలిసింది. ‘వారు’ అంటే ఎవరని అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించగా... పత్రికాధిపతి పేరు వెల్లడించినట్లు సమాచారం.
తాము మాత్రమే గోవాకు వెళ్లడం లేదని, వారూ వెళుతున్నారని, అలాంటివారిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించినట్లు తెలిసింది. దాంతో, ఆ పత్రికాధిపతికి డ్రగ్స్‌తో సంబంధం ఉన్నట్లు సాక్ష్యాలను సంపాదించే పనిలో అధికారులు పడ్డారు. ప్రాసంగిక సాక్ష్యాలు దొరికిన తర్వాత ఆ పత్రికాధిపతికి కూడా నోటీసు పంపించే అవకాశం లేకపోలేదని ఓ అధికారి వివరించారు. అలాగే, పూరి, శ్యాం విచారణ సందర్భంగా మరి కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చినట్లు తెలిసింది. వారి విషయంలోనూ సాక్ష్యాల సేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇలాంటివారు మరో 11 మంది వరకు ఉండవచ్చని తెలిసింది.
డ్రగ్స్ కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కెల్విన్ అండ్ గ్యాంగ్ అరెస్టు తర్వాత హైదరాబాద్‌లో పలు డ్రగ్స్ ముఠాల్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో, వారి సెల్‌ఫోన్ల విశ్లేషణలో పలువురి పేర్లు బయటకు వచ్చాయి. మరో డ్రగ్స్ విక్రేత పియూష్ సెల్‌ఫోన్ విశ్లేషణలో పలు మీడియా సంస్థల్లో పనిచేస్తున్న విలేకరుల పేర్లు గుర్తించారు. విచారణలో వారితో ఉన్న పరిచయాలపై పీయూష్ నుంచి దర్యాప్తు అధికారులు సమాచారం రాబట్టారు. పీయూష్ ఇచ్చిన సమాచారం, సెల్‌ఫోన్ విశ్లేషణల ఆధారంగా సుమారు 15 మంది విలేకరులకు నోటీసులు పంపించినట్లు తెలిసింది. ఈ నెల 24 నుంచి తమ ఎదుట హాజరుకావాలని వాటిలో పేర్కొన్నట్లు సమాచారం.
ఒక సంచలన సమాచారం బయటపడగానే పుంఖానుపుంఖాలుగా, చిలపలుపలువలుగా కథలల్లి రోజంతా ఇతరుల ప్రైవసీని బయటికిలాగి టీవీల్లో చూపించే మీడియా ఇప్పుడు అదే నీతిని ఈ జర్నలిస్టులకూ వర్తింప జేస్తుందా.. వాళ్లను కన్నందుకు, కట్టుకున్నందుకు వారి తల్లులనూ అక్కచెల్లెళ్లను, భార్యను కూడా ఇంటి నుంచి బయటకు లాగి బజారుకీడుస్తుందా..
రంగుటద్దాల్లో కూర్చుని ఇతరుల మీదకు రాళ్లు వేసేందుకు ప్రయత్నిస్తే ఆ రాళ్లలో కొన్నయినా మన అద్దాలమేడలకు తగులుతాయన్న సత్యాన్ని ఇప్పటికైనా మీడియా గ్రహిస్తే బాగుండు.