రేపటి నుంచే మేడారం మహా జాతర

మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (08:12 IST)
రేపు సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వన ప్రవేశంతో ముగియనుంది. దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే జాతర అది.

దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ.. మొత్తంగా చెప్పాలంటే ‘తెలంగాణ కుంభమేళా’ అది.. గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఆ పండుగే.. ‘‘సమ్మక్క-సారలమ్మ జాతర’’.

మేడారంలో జరిగే ఈ మహా జాతర రేపటి నుంచే ప్రారంభం కానుంది. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో జరగనున్న ఈ కుంభమేళాకు తరలి వచ్చేందుకు భక్తజనం సిద్ధమైంది.

ఇప్పటికే సమ్మక్క, సారలమ్మ దీక్ష తీసుకున్న భక్తులు మేడారానికి చేరుతుండగా..ఆ ప్రాంగణమంతా భక్త కోలాహలం నెలకొంది.

అటు.. పెళ్లి కొడుకు పగిడిద్దరాజును సమీప బర్లగుట్టపై నుంచి సోమవారం ఉదయం గుడికి తరలించారు. పగిడిద్ద రాజు ఆభరణాలను శుద్ధి చేసి పూజలు చేశారు.

అక్కడి నుంచి తొట్టివాగు వద్ద ఉన్న గద్దెల వద్దకు పగిడిద్దరాజును తీసుకెళ్లి గద్దెలపై నిలిపి సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పగిడిద్ద రాజు పడగలతో డోలీల చప్పుల్లతో కాలి నడకన మేడారానికి బయలుదేరారు.
 
రేపు సమ్మక్క,గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వన ప్రవేశంతో ముగియనుంది. రేపు సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఎల్లుండి (6న) సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు