హైదరాబాద్, రాంనగర్ హత్యకేసులోని మిస్టరీని నగర పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో తన మేనకోడలితో సంబంధం పెట్టుకున్నాడనీ ఓ స్నేహితుడు.. ఫ్రెండ్‌కు మద్యం తాపించి, కత్తితో పొడిచి చంపేశాడు. దీంతో నిందితుడిని అరెస్టు రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... కేరళకు చెందిన అరుణ్. పి. జార్జ్ (37), తన్‌కచన్ లాలు (41) అనే ఇద్దరూ ప్రాణ స్నేహితులు. వీరిద్దరూ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కొచ్చి స్థిరపడ్డారు. ఓ ప్రైవేట్ సంస్థలో అరుణ్ మేనేజర్‌గా పని చేస్తుండగా, రైల్వేలో ఏఎస్సైగా లాలూ విధులు నిర్వహిస్తున్నాడు.
అయితే, లాలు అక్క కూతురు భర్త విదేశాల్లో ఉన్నాడు. దీంతో తన మేనకోడలిని తన ఇంటికి తీసుకువచ్చాడు. అదేక్రమంలో భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా అరుణ్ ఒంటరిగా నివశిస్తున్నారు. అయితే తన మేనకోడలికి ఏదేని పని పెట్టాల్సిందిగా అరుణ్‌ను లాలూ కోరగా, అరుణ్ తన సంస్థలోనే అకౌంటెంట్‌గా చేర్పించాడు.
ఆ తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న లాలూ.. వారిద్దరిని పలుమార్లు హెచ్చరించాడు. ఈనేపథ్యంలో శుక్రవారం రాత్రి అరుణ్, లాలులు కలిసి మద్యం సేవిస్తూ తన మేనకోడలి వ్యవహారాన్ని లాలూ లేవనెత్తాడు. దీంతో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన లాలు తన వెంట ముందే తెచ్చుకున్న కర్రతో అరుణ్‌ను తలపై బలంగా మోది, కత్తితో పొడిచి చంపేశాడు.
ఆ తర్వాత పోలీసులకు ఆధారాలు దొరకకుండా ఇల్లు మొత్తం శుభ్రం చేశాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు మృతుడి మెడలోని గొలుసు, రెండు సెల్‌ఫోన్లు, నగదును తీసుకుని వెళ్లిపోయాడు. ఈ విషయం శనివారం రాత్రి వెలుగులోకి రావడంతో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, అసలు నిందితుడు లాలూయేనని నిర్ధారణకు వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.