అప్పు తీసుకుని తప్పించుకుని తిరుగుతున్న భర్త... హత్యకు గురైన భార్య

బుధవారం, 14 ఏప్రియల్ 2021 (09:18 IST)
భర్త చేసిన అప్పు.. భార్య ప్రాణాలను తీసింది. తీసుకున్న అప్పును చెల్లించకుండా భర్త తప్పించుకుని తిరుగుతున్నాడన్న కోపంతో అతని భార్యను పట్టుకుని చంపేశారు. ఈ దారుణం సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
 
సైదాబాద్‌ పోలీస్‌ ఠాణా పరిధి లోకాయుక్త కాలనీలో సోమవారం రాత్రి జరిగిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, కనోడియా పరిమళ్‌కుమార్‌ మెడికల్‌ వ్యాపారం చేస్తుండేవాడు. తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకున్నాడు. కార్వాన్‌కు చెందిన మెహ్రాజ్‌ బేగం నుంచి రూ.30 లక్షలు తీసుకున్నాడు. రెండేళ్లుగా తిరిగి ఇవ్వడం లేదు. గతంలో పలుమార్లు అతడి తండ్రి దినేష్‌కుమార్‌ను బొగ్గులకుంటలో అడిగినా కనీస స్పందన కనిపించలేదు. దీంతో గత ఏడాది పరిమళ్‌ కోసం గాలించగా అదృశ్యమయ్యాడు. 
 
లోకాయుక్త కాలనీలో దీర్ఘకాలంగా ఓ అద్దె ఇంట్లో ఉంటూ.. మకాం మార్చాడు. పక్షం రోజుల క్రితం తిరిగి లోకాయుక్త కాలనీలోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నాడని సమాచారం అందుకుని సోమవారం రాత్రి నిందితులు వచ్చారు. పరిమళ్‌కుమార్‌ భార్య మంజుల(45), ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఆమె ఇంటి వద్దకు మెహ్రాజ్‌ బేగం కుమారుడు ఇమ్రాన్‌.. నలుగురు స్నేహితులతో కలిసి వచ్చాడు. 
 
ఇంట్లో పిల్లలకు, అపార్టుమెంటువాసులకు విషయం తెలుస్తుందని భావించి.. ఆమె కిందికి వెళ్లి మాట్లాడదామని వారిని తీసుకొచ్చింది. తనతో భర్త ఉండటం లేదని, అతని సమాచారం లేదని ఆమె బదులు ఇవ్వడంతో.. ఆవేశంతో ఊగిపోయిన ఇమ్రాన్‌.. కత్తితో పొడిచి హత్య చేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 
 
ఈ హత్య సమాచారం తెలుసుకున్న పరిమళ్‌ తండ్రి దినేష్‌కుమార్‌.. ఘటన స్థలానికి వచ్చి ఆర్థిక లావాదేవీల విషయాన్ని, సంబంధిత వ్యక్తుల వివరాలు పోలీసులకు చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. మెహ్రాజ్‌ బేగం, ఇమ్రాన్‌లను గోల్కొండలో సోమవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మిగతా నలుగురిని మంగళవారం అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు