బీజేపీలో చేరడం ఖాయం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే

మంగళవారం, 15 అక్టోబరు 2019 (07:20 IST)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, ఆమె కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి పార్టీ మారడం ఖాయమైంది. ఈ నెల చివరి వారంలో వారు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోనున్నారు.

పార్టీ మారే విషయమై ఆదివారం భీమ్‌గల్‌ మండలం మెండోర శివారులో అనుచరులతో సమావేశం నిర్వహించారు. పరిమిత సంఖ్యలో ముఖ్య అనుచరులను సమావేశానికి ఆహ్వానించగా, సుమారు మూడొందల మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అనుచరులంతా బీజేపీలో చేరాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మీ వెంట మేముంటామని స్పష్టం చేశారు. ఇంతకాలం పదవిలో ఉన్నా, లేకున్నా వెంట ఉన్నామని, ఇకనుంచి కూడా ఉంటామన్నారు. బీజేపీ అగ్ర నాయకత్వం పార్టీలోకి ఆహ్వానించిన విషయాన్ని అన్నపూర్ణమ్మ అనుచరులకు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో చేరడమే ఉత్తమమని అనుచరులు చెప్పారు.

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున పోలింగ్‌ తర్వాత ఇరవై రెండో తేదీ నుంచి ఈ నెలాఖరు మధ్యలో ఎప్పుడైనా వారు బీజేపీలో చేరే అవకాశముంది. అన్నపూర్ణమ్మ, మల్లికార్జున్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరనున్నారు. తర్వాత స్థానికంగా బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు రాష్ట్రస్థాయి నాయకులను ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా అనుచరులు భారీ సంఖ్యలో బీజేపీలో చేరనున్నారు.

ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎంపీ అర్వింద్‌, అన్నపూర్ణ మ్మ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అప్పుడే చేరికకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నెల పద్దెనిమిదో తేదీన పార్టీలో చేరాలని లక్ష్మణ్‌ సూచించగా, అనుచరులతో సమావేశమై చేరిక తేదీని ఖరారు చేస్తామని అన్నపూర్ణమ్మ చెప్పారు. అనుచరులతో సమావేశమై పార్టీలో చేరికను ఖరారు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు