భూ అక్రమాలపై తెలంగాణ అసెంబ్లీ సభా సంఘం : స్పీకర్

శుక్రవారం, 28 నవంబరు 2014 (09:36 IST)
తెలంగాణ వ్యాప్తంగా సహకార గృహ నిర్మాణ సంఘాలకు (కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ) భూ కేటాయింపులు, వక్ఫ్‌భూముల అన్యాక్రాంతంపై విచారణకు రెండు సభాసంఘాలు ఏర్పాటయ్యాయి. స్పీకర్ మధుసూదనాచారి గురువారం అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. 
 
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఫిలింనగర్ గృహ నిర్మాణ సొసైటీలతో పాటు అందుల్లో ప్రమేయం ఉన్న వక్ఫ్ భూముల్లో అక్రమాలకు సంబంధించి అసెంబ్లీ నిబంధనావళిలోని 74వ నియమం కింద ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, మరో నలుగురు సభ్యులు ఇచ్చిన నోటీసుకు సంబంధించి సభలో చర్చ జరిగింది. 
 
ఈ విషయమై విపక్ష సభ్యులు వెలిబుచ్చిన ఆందోళనతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఏకీభవించారు. సభాసంఘాలు వేసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని ప్రకటించారు. వీలైనంత తొందరగా విచారణ జరిపించి నివేదికలు తెప్పించుకోవాల్సిన అవసరముందన్నారు. 
 
జూబ్లీహిల్స్ సొసైటీకి 1964 జనవరి 31న ఎకరాకు రూ.200 చొప్పున మార్కెట్ విలువ చెల్లింపుపై షేక్‌పేట, హకీంపేట గ్రామాల్లో 1,398 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. స్థలాల కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగినపట్టు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సహకార శాఖ విచారణల్లో తేలింది. సభ్యుల ఎంపిక తదితరాల్లో సొసైటీ సరిగా వ్యవహరించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్నీ నిగ్గు తేల్చేందుకే సభా సంఘం ఏర్పాటైనట్టు ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి