ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుతూ మినీ టౌన్ షిప్‌ల నిర్మాణం

శుక్రవారం, 13 ఆగస్టు 2021 (09:12 IST)
హైదరాబాద్ నగరానికే మణిహారంలా ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూత మినీ టౌన్ షిప్‌లను నిర్మించనున్నారు. అంటే రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు. పనిచేసే చోటే నివాసం ఉండేలా అందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 
 
ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ నగరంపై అన్ని విధాలుగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలోనే సమాంతరంగా అభివృద్ధి కేంద్రాల నిర్మాణం అత్యవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఇందులోభాగంగానే నగరంతో సంబంధం లేకుండా ట్రాన్సిట్‌ ఓరియంటెడ్‌ గ్రోత్‌ సెంటర్లుగా పిలిచే వీటి నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
 
158 కిలోమీటర్లు ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు చుట్టూ మొత్తం 19 ఇంటర్‌ ఛేంజ్‌లు ఉండగా, అందులో 13 చోట్ల అన్ని వర్గాలకు అనువైన ప్రాంతాలను మినీ పట్టణాలుగా ఏర్పాటు చేయవచ్చని గుర్తించారు. 
 
ఇందులోభాగంగా, ఆదిబట్ల, బొంగుళూరు, ఘట్‌కేసర్‌, గుండ్లపోచంపల్లి, కీసర, కోకాపేట, మేడ్చల్‌, పటాన్‌చెరు, పెద్ద అంబర్‌పేట, శామీర్‌పేట, తెల్లాపూర్‌, తుక్కుగూడ, తిమ్మాపూర్‌ల వద్ద ఈ రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నగరంపై ఒత్తిడి తగ్గడంతో పాటు స్థానికంగా ఉండే వారికి స్వయం ఉపాధి, భవిష్యత్‌లో పెరిగే జనాభా దృష్ట్యా ఉద్యోగం, నివాసాలకు దోహదపడనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు