ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (23:02 IST)
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని మంత్రి పువ్వాడ అభినందించారు.
దేశంలోని జిల్లా ఆస్పత్రుల పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ విడుదల చేశారు.
ఈ నివేదికలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలకు ర్యాంకింగ్ ఇచ్చారు. మధ్యస్థాయి ఆస్పత్రుల విభాగంలో 65.42 శాతంతో ఖమ్మం జిల్లా ఆస్పతి దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.
అదేవిధంగా డయాగ్నస్టిక్ సేవల్లో రాష్ట్రంలో ఒక్కో ఆస్పత్రిలో సగటున 14 రకాల కోర్ హెల్త్‌కేర్ సేవలు, డయాగ్నస్టిక్ సేవలు ఉన్నాయి.
డయాగ్నస్టిక్ సేవల్లో చిన్న ఆస్పత్రుల విభాగంలో దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తూ ఖమ్మం జిల్లా ఆస్పత్రి రెండో స్థానంలో ఉంది. ఈ ఆస్పత్రిలో డయాగ్నసి్‌సకు అవసరమైన అన్ని సేవలు ఉన్నాయని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.