రాష్ట్ర నేతల అభిప్రాయాలను సేకరించిన రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత గులాబ్ నబీ ఆజాద్ ఈ మేరకు అధినేత్రి సోనియాకు సిఫారసు చేసినట్లు తెలిసింది. ఆజాద్.. టీపీసీసీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఒకవైపు మునిసిపల్ ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన తరుణంలో ఎన్డీయే వైఫల్యాలపై అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించాలంటే కష్టమవుతుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
మునిసిపల్ ఎన్నికల్లో స్థానిక అంశాలే ప్రభావం చూపుతాయని, వాటిపైన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. సీనియర్ నేత జి.నిరంజన్ కల్పించుకుని.. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రావాలంటే పీసీసీ నాయకత్వంలోనే విప్లవాత్మక మార్పులు రావాల్సి ఉందని అన్నట్లు తెలిసింది.
తహసీల్దార్ విజయారెడ్డి, ఆర్టీసీ కార్మికుల మృతికి సంతాపం తెలుపుతూ సమావేశం తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నన్ని రోజులూ కశ్మీర్‌లో ప్రశాంతత నెలకొనే పరిస్థితి లేదని ఆజాద్ అన్నారు. రాష్ట్రంలో తహసీల్దారు విజయారెడ్డి సజీవ దహనం ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఉద్యోగుల రక్షణకు చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కాగా.. ఆజాద్ సమక్షంలోనే వీహెచ్, షబ్బీర్ అలీ వాగ్వాదానికి దిగారు. పార్టీలోని సీనియర్లను అవమానించేలా మాట్లాడుతున్నారని, షబ్బీర్ అలీ తమను శవాలతో పోల్చారని వీహెచ్ ఫిర్యాదు చేశారు.
అక్కడే ఉన్న షబ్బీర్ అలీ జోక్యం చేసుకుని.. తాను ఎప్పుడు, ఎవరి వద్ద ఆ వ్యాఖ్యలు చేశానంటూ వీహెచ్‌ను నిలదీశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలూ వాదులాటకు దిగారు. ఆయా సమావేశాల్లో ఖుంటియా, భట్టివిక్రమార్క, జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్, పొన్నం, పొన్నాల, షబ్బీర్ అలీ, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ చీఫ్‌గా అవకాశమివ్వాలి: కోమటిరెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశమివ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి చెప్పారు. గులాంనబీ ఆజాద్‌కూ విజ్ఞప్తి చేశానని, గాంధీభవన్‌లో మీడియాకు తెలిపారు. కోమటిరెడ్డి విన్నతిపై సానుకూలంగా స్పందించాలని ఆయన అనుచరులు నినాదాలు చేశారు.