రూ.2000 నోటుతో ఉపయోగం లేదు... నల్లడబ్బు సృష్టికర్తలు కాంగ్రెస్ నాయకులు... సీఎం కేసీఆర్

సోమవారం, 28 నవంబరు 2016 (20:22 IST)
జనం జేబుల్లో రూ.2000 నోట్లు ఉన్నాయి. కానీ వాటివల్ల ఉపయోగం ఉండటం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారంనాడు తెలంగాణ కేబినెట్ మంత్రుల సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం గొప్పదనీ, ఐతే దేశాన్ని అవినీతి రహితంగా, నల్లడబ్బు లేని దేశంగా మార్చితేనే ఇప్పుడు చేస్తున్నవి సఫలమవుతాయని అన్నారు. ఎవరూ ఎవరికి లంచం ఇవ్వకూడనటువంటి దేశంగా భారదేశం కావాలని అన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... నల్లధనం సృష్టికర్తలే కాంగ్రెస్ పార్టీ నాయకులని దుయ్యబట్టారు. దేశంలో అవినీతిపై ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదనీ, ప్రభుత్వం వారి వెంటే ఉంటుందన్నారు. దేశంలో నగదు రహిత కార్యకలాపాలు జరిగితేనే అవినీతి, నల్లధనం నిర్మూలించవచ్చన్నారు. సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీసుకుని ప్రజలు నగదు రహిత లావాదేవీలు జరిపేట్లు ప్రయత్నిస్తామన్నారు. అది విజయవంతం అయ్యాక రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల్లోనూ అదే ఫార్ములాను ఆచరిస్తామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి