చారిత్ర‌క మోజంజాహి మార్కెట్ కు పూర్వ వైభ‌వం

శుక్రవారం, 14 ఆగస్టు 2020 (18:39 IST)
హైదరాబాద్ ఒకప్పుడు ముత్యాల నగరిగా ప్రపంచ ఖ్యాతినార్జించిన. ఆసఫ్ జాహీల, కాకతీయుల, భారత-ఇస్లాం వాస్తు శిల్ప నైపుణ్యాలు కలబోసుకున్న స్మార‌క‌ చిహ్నాలు, దక్కనీ తెహజీబ్'గా అలరారిన విభిన్న, సుసంపన్న సంస్కృతుల సమ్మేళనాలకు మోజంజాహి మార్కెట్ ప్రతిబింబం.

ఇక్కడ ప్రతి స్మారక చిహ్నం ఒక చారిత్రక సన్నివేశానికి సాక్షిగా నిలుస్తుంది. ఆసఫ్జాహి వంశీకుల ఏలుబడిలో ఏడుతరాల నిజాం నవాబులు 228 ఏళ్ళపాటు సాగించిన పాలన 1948 వరకు సాగింది. ప్రపంచ దేశాల్లోని అలనాటి ఆధునికతలను ఆవిష్కరిస్తూ హైదరాబాద్ నగరానికి ప్రాణంపోసిన ఘనత ఆరవ, ఏడవ నిజాం ప్రభువులది.
 
1911లో నగరానికి పెద్దఎత్తున వరద ప్రమాదం ముంచుకొచ్చింది. 1912లో ప్లేగు మహమ్మారి పైశాచికంగా విరుచుకుపడింది. దీనితో అప్పటి ఏడవ నిజాం నవాబు సరికొత్త ఆలోచనలకు తెరదీశారు. నగిషీలు చెక్కడమే కాదు, నగరాన్ని ఆర్థికంగా కూడా బలంగా తీర్చిదిద్దాలని అనిపించింది. అప్పటిదాకా ఉన్న 'హైదరాబాద్ రాజ్య అభివృద్ధి మండలి'ని 'నగర అభివృద్ధి మండలి'గా పేరు మార్చారు.

దీనికింద నగరాభివృద్ధికి బహుముఖ రచన చేసాడు. దానిలో భాగమే నగరం నడిబొడ్డున ఒక మార్కెట్ అవతరణ. 1932లో పురుడుపోసుకుంది ఆలోచనకు మే 31, 1933న (17 సఫర్ 1352 హెచ్ ) పర్మాను విడుదలయింది. అక్షరాలా మూడు లక్షల రూపాయల ఆమోదిత అంచనాలతో  మార్కెట్ నిర్మాణం 1935 నాటికి పూర్తయింది.

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రెండవ కుమారుడయిన మోజంజా బహద్దూర్ పేరిట ప్రారంభమయింది. సామాన్య ప్రజానీకంతో పాటు, నిజాం రాజకుటుంబీకుల అవసరాలకు కూడా అందుబాటులో ఉండేవిధంగా సువిశాలంగా 1.77 ఎకరాల విస్తీర్ణంలో 120 దుకాణాలతో త్రికోణాకృతిలో గ్రానైట్ రాళ్లు, ఇనుప దూలాల అమరికతో, ప్ర‌త్యేక నిర్మాణ శైలి, సాంప్రదాయాల్ని ప్రతిబింబించే కమాన్లు, గుమ్మటాలతో సర్వాంగ సుందరంగా సిద్ధమయింది. ఆరోజుల్లో దీనికి ప్రత్యేక ఆకర్షణ. గుర్తింపు గడియారం స్తంభం.
 
85 ఏళ్లకు పైగా నిర్విరామంగా సేవలందించిన ఈ భవనం క్ర‌మంగా అలనాటి  ప్రాభవాన్ని కోల్పోయింది. మెరుగులు తగ్గాయి, నిర్మాణం పట్టు సడలింది ఆలనాపాలనా కరువయింది. వారసత్వ సంపదలు నిలిచిన ఈ రాతి కట్టడం క్రమేణా కృశిస్తూ దాని వైభవం కనుమరుగయ్యే పరిస్థితి వచ్చేసింది.
 
పునరుజ్జీవం
అప్పటికీ ఇప్పటికీ ప్రపంచ పటంలో దాని ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్న హైదరాబాద్ నగర పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలని ప్రస్తుత ప్రభుత్వ సంకల్పానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రితోపాటు, ప్రిన్సిపల్ సెక్ర‌ట‌రి  అర్వింద్ కుమార్, ఐ.ఏ.ఎస్‌, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఈ కార్యక్రమాన్ని దాని భుజాల మీదికి తీసుకుని ఇప్పుడు దిగ్విజయంగా పూర్తి చేసింది.

85 ఏళ్ళనాటి వైభ‌వానికి ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా వారసత్వ సంపద చెక్కుచెదరకుండా మరికొన్ని శతాబ్దాలు దీటుగా నిలిచేలా చేయాలంటే. మున్ముందు ఆ నిర్మాణంలోని ప్రతి అంగుళాన్ని దించాలి. ఎక్కడ పట్టుసడలిందో గుర్తించాలి దాన్నంతా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు డాక్యుమెంటేష‌న్‌ (రికార్డు రూపంలో భద్రపరుచు కోవడం) ప్ర‌క్రియ‌ను చాకచక్యంగా పూర్తి చేసింది
 
ఛ‌జ్జాలు, పైకప్పు
ఎం.జె మార్కెట్ భవన నిర్మాణ పైకప్పు -జిహెచ్ఎంసి చేపట్టే క్షణానికి ....అంత‌టా లోతుకు పాతుకుపోయిన వేళ్ళతో పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా తొలగించి ఆ ఖాళీల‌ను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నింపాల్సి వచ్చింది. గ‌తంలో పైకప్పునుండి నీళ్ళు కారినప్పుడల్లా, దుకాణాదారులు పైకప్పు మీద తారును పొరలు పొరలుగా వేస్తూ వచ్చారు.

ఎండా, వానాల  వాతావరణ ప్రభావాలకు జాక్ ఆర్చిలు (లింటల్స్ వంటివి), స్లాబుల్లో ఇనుముండే భాగాలు బాగా దెబ్బతిన్నాయి. పైకప్పు మీద పేరుకుపోయిన తారును మొత్తం చెక్కి నీళ్లు కారకుండా అధునాతనంగా రూపుదిద్దాల్సి వచ్చింది. పైకప్పు దాని తాలూకు జాక్‌ ఆర్చిలు కొన్ని చోట్ల‌ పూర్తిగా పునర్ నిర్మించాల్సి వచ్చింది.

ఛ‌జ్జాలు,  (బాల్కానిలు/గవాక్షాలు), వాటికి ఊతంగా అమర్చిన బ్రాకెట్ లు విరిగిపోయి ఉన్నాయి.  మునుపటి రూపాన్ని తీసుకుని రావడానికి వాటిని జాగ్రత్తగా నున్నం, మోర్టార్ (గచ్చు) మిశ్రమాలను ఉపయోగించాల్సి వచ్చింది. తిరుగుతూ ఎక్కడానికి వీలుగా. వలయాకారంలో అమర్చిన మెట్ల‌ను కూడా అదనంగా మరిన్ని చేరుస్తూ దాదాపు మొదటి నుండి పునరుద్ధరించడం అయింది. 
 
రాతి గోడలు, మెట్ల దారులు, గడియారపు స్తంభం
గోడలు, గుమ్మటాలు మీద పేరుకుపోయిన రంగులు, పెచ్చుల‌ను ఇంచి ఇంచి చూసుకుంటూ చెక్కాల్సి వచ్చింది. గడియారపు స్తంభానికయితే ఇప్పటివరకు తెల్లరంగు పులుముతూ వచ్చారు. కాని దాని పూర్వపు రంగు వేరు. ఈ స్తంభానికి ఉపయోగించే రాయి అసలు సిస‌లు సొగసును బయట పెట్టడానికి చాలా చెమటోడ్నితేనే కానీ సాధ్యపడలేదు.

ఆ గడియార స్తంభం నాలుగు దిక్కులకు కనిపించే గడియారాలు పాడయిపోయాయి. ఒకప్పుడు చెవులకింపుగా గంటలుకొడుతూ వచ్చిన అవి దశాబ్దాలుగా మూగపోయాయి. ఆ పాత మధుర‌ స్వరాలతో కొత్త గడియారాలు ఇప్పుడక్కడ కొలువుతీరి ఆ ప్రాంతం గుండా వెళ్ళేవారిని పులకరింప చేస్తాయి. మీనార్లు అన్నింటికీ వాటి గుమ్మట శిఖ‌రాల‌ను బంగారు పూత మెరుపుల‌తో కుంభాకార‌ కలశాలవంటి వాటితో అలంకరించడం జరిగింది.
 
ప్రధాన ద్వారాలు, కిటికీలు, కాలిబాటలు
మార్కెట్ లోపల కేంద్ర భాగంలో గుండ్రటి ఆకారంలో ఒక మండువా దశాబ్దాలుగా ఉంటున్న‌ది. అయితే అది మూల నిర్మాణంలో లేదు. అందువల్ల దానిని తొలగించి సుందరీకరించి మధ్యలో జెండా స్తంభాన్ని నిలబెట్టడం జరిగింది. మొత్తం మార్కెట్ ప్రదేశమంతా కాలిబాటలు, వాటికి కంచెగా చిన్న స్తంభాలను, మధ్యభాగంలో అక్కడక్కడా కొనుగోలుదారులు కూర్చుని సేదదీరడానికి ఆసనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

ఇప్పటివరకు మార్కెట్ ప్రవేశ ద్వారం నైరుతిలో ఉన్నా, అది పాడ‌యిపోవ‌డంతో ఆ భవన నిర్మాణానికి స‌రితూగే అలంకరణలతో ప్రధాన ద్వారాన్ని అలాగే ఎక్కడికక్కడ ద్వారాలను కిటికీలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరిగింది.
 
మురుగునీటి పారుదల, విద్యుదీకరణ, ఆక్రమణలు
ఇప్పటికే ఆ భవనాన్ని కప్పేస్తూ సైన్‌ బోర్డులు, ఇతర తాత్కాలిక కట్టడాలు, గాజు అద్దాల‌తో అడ్డు గోడ‌లు, అడ్డదిడ్డంగా కేబుళ్లు, కరెంటు తీగలు వేళ్ళాడుతూ గజిబిజిగా కనిపించేవి. వాటిని ఏకమొత్తంగా తొలగించి ప్రాచీన కట్టడ వైభవాన్ని రెండింతలు చేసే విధంగా, పండగలప్పుడు మరింత శోభాయమానంగా కనిపించడానికి వీలుగా లైటింగ్ సౌక‌ర్యం దీపాలంకరణ ఏర్పాటు చేయడం జరిగింది.

మార్కెట్ తొలి నిర్మాణంలో మురుగు నీటి పారుదల సౌకర్యం ఉండేది కాదు. దానికి తోడు అడ్డదిడ్డంగా అన్నీ అక్రమణలు ఉండేవి. వాన వస్తే రొచ్చుగా త‌య్యార‌య్యేది. ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తంలో వ‌ర‌ద‌నీటిని వెంటనే తరలించే విధంగా మార్పులు జరిగాయి. అంతకుముందున్న మాంసం దుకాణాలు అంత పనిశుద్రం గా ఉండేవి కావు. ఇప్పుడు అధునాతన పద్ధతులతో వాటిని పునరుద్ధరించడం జరిగింది.
 
మొత్తం పునరుద్ధరణ కార్యక్రమం రూ. 15 కోట్లతో 2018 లో ప్రారంభమై  14 ఆగ‌ష్టు 2020న ప్రారంభోత్స‌వానికి సిద్ద‌మైంది. ప్రాచీన కట్టడం, పైగా వారసత్వ సంపద అయినందువల్ల పునర్ వైభవాన్ని తీసుకురావడానికి అత్యంత శ్రద్ధ తీసుకోవ‌డం జ‌రిగింది. ఒక చారిత్ర‌క వారసత్వ సంపద చరిత్రకే పరిమితం కాకుండా దానిని పునరుత్తేజితం చేసి పూర్వ స్మృతుల‌ను సజీవంగా నిలపడానికి పలువురు వ్యక్తులు, సంస్థలు చేసిన కృషి చాలా ఉంది.
 
పురపాలక, పట్టణావృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్ర‌ట‌రి శ్రీ అర్వింద్ కుమార్ ఐఏఎస్ వ్యక్తిగత శ్రద్ధ చూపడమే కాక దీనిని ఏకంగా దత్తత తీసుకుని ప్రశంసనీయంగా కృషి చేసారు. జిహెచ్ఎంసి అధికారులు, సిబ్బంది, ఇతరత్రా సంస్థల తాలూకు వారు దృడ సంకల్పంతో శ్రమించారు వృత్తినిపుణులు, చరిత్రకారులు, నిర్మాణ రంగ ప్రముఖులు, దుకాణాదారులు అలా సమాజంలో పలు భిన్న వర్గాల వారు అందించిన అమూల్య అభిప్రాయాలు కూడా కీలక పాత్ర పోషించాయి.

ప్రిన్సిపల్ సెక్ర‌ట‌రి స్థాయి అధికారి దగ్గర నుంచి ఉన్నత స్థాయి సిబ్బంది అంతా అనునిత్యం మొదటినుండీ మానిట‌రింగ్ చేస్తుండ‌డంతో ఈ పనిలో నిమగ్నమయిన వారు పూర్తి అంకితభావంతో పనిచేసారు.
 
పునఃప్రారంభం
14 ఆగస్టు, 2020 నుంచి మోజంజాహీ మార్కెట్టు మళ్ళీ పూర్వవైభవం నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మార్కెట్ మధ్యలో ఉన్న గుమ్మటం నిజాం కాలంనాటి జ్ఞాపకాలను, ఆధునిక కాలంనాటి జీవన శైలిని గుర్తు చేసే విధంగా సమాచారాన్ని అందించే ఏర్పాటు చేసారు. దీన్నంతా కలియతిరిగే అనుభూతిని హెరిటేజ్ కన్సల్టెంట్ మధు ఓట్టరీ రూపొందించిన బ్రోచ‌ర్‌ అందిస్తున్నది.

జిహెచ్ఎంసి పర్యవేక్షణలో పునరుద్ధరణ పనులన్నింటినీ ఫొటోల ద్వారా చలనచిత్రం ద్వారా , కాఫీ టేబుల్ బుక్ రూపంలో చలనచిత్ర ప్రముఖులు, డాక్యుమెంటరీ, రూపకర్త శ్రీ దూలం సత్యనారాయణ నిక్షిప్తం చేశారు. పునఃప్రారంభం నుండి మూడు రోజులపాటు ఒక ఫొటోగ్యాలరీ ప్రజల సందర్శనార్థం ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు