ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగడించిన సమ్మక్కసారక్క జాతర వైభవోపేతంగా జరుగుతోంది. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ముఖ్యంగా, ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేసింది.
కాగా, ఈ మహాఘట్టంలో భాగంగా మంగళవారం తొలి ఘట్టం జరిగింది. పగిడిద్ద రాజును పెళ్లి కుమారుడుగా ముస్తాబు చేసి మేడారం జాతరకు తీసుకొచ్చే తంతును పూర్తి చేశారు. గురువారం సమ్మక్క, సారలమ్మ గోవిందరాజులను గద్దెల వద్దకు తీసుకొచ్చారు.
సమ్మక్క - సారలమ్మలను చిలకల గుట్టమీద నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఇదే అత్యంత కీలకమైన ఘట్టం. కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క ఆగమనం అందరూ పులకించే అద్భుత ఘట్టం. చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్క తల్లిని పూజారులు తీసుకొచ్చే వేడుకలో లక్షల మంది భక్తులు పాల్గొని, ఆ తల్లికి జయజయధ్వానాలు పలుకుతూ హారతులు ఇచ్చారు.