భార్య తల నరికి మరో వ్యక్తి ఇంటి గుమ్మంలో వేసిన భర్త!!

గురువారం, 15 అక్టోబరు 2020 (15:25 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కసాయిగా మారిపోయాడు. అనుమానం పెనుభూతమైంది. దీంతో భార్య తల తెగనరికేశాడు. ఆ తలను తీసుకెళ్లి మరో వ్యక్తి ఇంటి గుమ్మంలో వేశాడు. ఈ భయానక దారుణం గురించిన వివరాలను పరిశీలిస్తే... 
 
నారాయణఖేడ్‌ ప్రాంతానికి చెందిన సాయిలు అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 50 ఏళ్ల సాయిలు ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్నాడు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ ఆమెను మానసికంగా వేధిస్తూ, గొడవపడుతూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అపుడు కసితో రగిలిపోయిన సాయిలు... భార్య తలను గొడ్డలితో నరికాడు. రక్తమోడుతున్న భార్య తలతో బైకుపై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి, ఆ తలను తీసుకువెళ్లి, భార్య ఎవరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తాను అనుమానిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంటి గుమ్మంలో పడేశాడు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సాయిలును అరెస్ట చేశారు. స్థానికంగా ఈ ఘటన భయభ్రాంతులకు గురిచేసింది. కేసు విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు