నంద్యాలలో అబ్ధుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ తీరు, వైసీపీ నేతల వల్లే సలాం కుటుంబం ఆత్మహత్యకుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీకి చెందిన రామచంద్రరావు వాదించడం వల్లే సలాం ఆత్మహత్య కేసు నిందితులకు బెయిల్ వచ్చిందని సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు అంటున్నారు.
ఈ వ్యవహారంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. కోర్టులు నిందితులకు బెయిల్ ఇవ్వడంపై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పలుకుబడి ముందు గెలవలేకపోతున్నామంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలపై మాట్లాడరెందుకు? బురదజల్లడం ద్వారా అరాచకాలను సమర్థించుకోగలరా? అంటూ ప్రశ్నించారు.
ఈ కేసుపై స్పందిస్తూ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం బాధను కలిగించిందని ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను అరెస్ట్ చేశామన్నారు. టీడీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్న ఒక లాయర్ బెయిల్ పిటిషన్ వేశారని.. బెయిల్ రద్దు చేయాలని తాము కోర్టుకు వెళ్లామన్నారు. న్యాయం ఎవరికైనా ఒకటేనని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరామని చెప్పారు. కావాలనే కొందరు ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ జూమ్‌లో మాత్రమే మైనార్టీలపై ప్రేమను చూపిస్తున్నారని అన్నారు.