ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

గురువారం, 21 నవంబరు 2019 (08:44 IST)
ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. జార్ఖండ్ రాష్ట్రంలో జమతరా జిల్లా చెందిన వీరు ఎక్కువగా ఆన్‌లైన్‌లో చీటింగ్‌కు పాల్పడుతున్నారని సీపీ వివరించారు.

నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన సీపీ.. బ్యాంక్ అకౌంట్‌లను టార్గెట్‌గా చేసుకొని ఈ ముఠా మోసాలకు పాల్పడుతోందన్నారు. ఆన్‌లైన్‌లోని బ్యాంకులకు చెందిన ప్రతి యాప్‌ను వీరు తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. గతంలో ఈ ముఠా సిమ్ స్వైపింగ్, కార్డుల క్లోనింగ్, ఓటీపీ ఫ్రాడ్, ఈ వ్యాలెట్ మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు.

బల్క్ మేసేజ్‌ల ద్వారా ప్రజలకు మెసేజ్‌లు పెట్టి.. మీ అకౌంట్ క్లోజ్ అయ్యిందంటూ వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. తద్వారా అకౌంట్‌లోని డబ్బులను సులువుగా కాజేస్తారని వివరించారు. ఈ క్రమంలోనే గతనెల 21న నగరానికి చెందిన ఓ డాక్టర్‌ను కూడా ఈ ముఠా బురిడి కొట్టించింది. అతని బ్యాంక్ నుంచి రూ.1.29 లక్షలు డ్రా చేసుకున్నారు. మోసాన్ని గ్రహించిన బాధిత వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న సైబర్‌క్రైమ్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యుల ఆట కట్టించారు. ముఠాలోని సంజయ్ కుమార్ మండల్, రామ్ కుమార్ మండల్, జంరుద్దీన్ అన్సారీ, జితేంద్ర మండల, బీరేందర్ కుమార్ మండల్, రోహిత్ రాజ్‌ లు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌గా సీపీ ప్రకటించారు.

ఈ ముఠా 2016 నుంచి ఈ తరహా మోసాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఓటీపీ నెంబర్, పాస్‌వర్డ్, యూపీఐ కోడ్‌లు ఎవరికీ చెప్పవద్దని సీపీ సజ్జనార్ సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు