డిసెంబరు 7న తెలంగాణ ఎన్నికలు.. 11న పోలింగ్ : తాత్కాలిక షెడ్యూల్ రిలీజ్

సోమవారం, 25 సెప్టెంబరు 2023 (14:33 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం తాత్కాలిక షెడ్యూల్‌ను నిర్ణయించింది. ఈ షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 7వ తేదీన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. 11వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు. ఈ తాత్కాలిక షెడ్యూల్ ఆధారంగా ఎన్నికల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే, ఈ షెడ్యూల్‌లో నిర్ణయించిన తేదీలకు కాస్త అటూ ఇటూగా ఎన్నికల పోలింగ్ ఉండే అవకాశం ఉంది. 
 
గత 2018లో జరిగిన సాధారణ ఎన్నికలకు కూడా ఇదేవిధంగా తాత్కాలిక షెడ్యూల్‌ను నిర్ణయించింది. ఆ షెడ్యూల్‌కు  అటుఇటూగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఎన్నికల పోలింగ్‌ను సజావుగా పూర్తి చేసింది. నిజానికి తెలంగాణాతో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబరు నెలలో మొదటివారం లేదా రెండో వారంలో ఎపుడైనా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉంది. 
 
అయితే, తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్‌లతో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్‌బెంచ్ అక్టోబరు 3 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ తర్వాత వాస్తవ ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు