లాభాలు లేకుంటే ఆర్టీసీని మూసివేస్తాం : కేసీఆర్ హెచ్చరిక

శుక్రవారం, 17 జూన్ 2016 (11:13 IST)
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ హెచ్చరించారు. లాభాల బాటలో పయనించకుంటే ఆర్టీని మూసివేస్తామని ఆయన తేల్చిచెప్పారు. అంతేకాకుండా, ఆర్టీసీలో కాంట్రాక్టుకు తీసుకున్న ప్రైవేటు బస్సులు లాభాల బాటలో నడుస్తున్నప్పుడు ఆర్టీసీ బస్సులు మాత్రం ఎందుకు నష్టాల్లో నడుస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. 
 
ఆర్టీసీలోని క్షేత్రస్థాయి అధికారులతో కేసీఆర్‌ శుక్రవారం సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించనున్న దృష్ట్యా సమావేశ అజెండాను రూపొందించేందుకు ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రితో గురువారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల అవసరాలకు తగినట్లు ఆర్టీసీ బస్సులు నడపటంలేదు. ఆ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. ఆమేరకు సేవలను విస్తృతం చేయాలి. ఆదాయ మార్గాలను పెంచుకోవాలన్నారు. 
 
కార్మికులు తరచూ సమ్మెలు చేపట్టడంతో నష్టాలు ఎక్కువవుతాయి. నష్టాలతో నడపడంకన్నా మూసివేయడం మంచిదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు సృజనాత్మక వ్యూహాలను రూపొందించాలి. రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ను నియమించాలి. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలుగా కొరియర్‌, సరకు రవాణా, మినీ బస్సులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి