ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ సంబంధాలే ఇతివృత్తంగా చేసిన అనేక రచనలు ఆమెకు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టాయని సిఎం అన్నారు. తెలుగు సాహితీ వికాసానికి, నవలా ప్రక్ర్రియను సుసంపన్నం చేయడానికి ఆమె చేసిన రచనలు ఉపయోగపడ్డాయన్నారు. ఆమె కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సిఎం, ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు.
1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో యుద్దనపూడి సులోచనరాణి జన్మించారు. తను పరిశీంచిన జీవితాలను కథా వస్తువులుగా తీసుకొని ఆమె రచనలు చేశారు. తర్వాత కాల్పనిక జగత్తుకు అనుగుణంగా, మారుతున్న ప్రజల జీవిన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి పాత్రలను సృష్టించారు.
భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, స్త్రీల విషయానికి వస్తే మధ్య తరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి. ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు.
యుద్దనపూడి సులోచనారాణి తొలిసారిగా అమ్మాయిలు చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1965లో మనుషులు - మమతలు సినిమాకు కథను అందించారు. తర్వాత వీరు రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. అయితే సెక్రటరీ మాత్రం ఓ లెజండ్ గా మిగిలిపోయింది.