పాలమూరులో దారుణం : కారుతో ఢీకొట్టి.. కత్తితో మెడ కోసి...

శుక్రవారం, 12 మార్చి 2021 (07:57 IST)
తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ (పాలమూరు) జిల్లాలో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. కారుతో ఢీకొట్టించి, కత్తితో మెడకోసి చంపేశారు. 
 
స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, మహబూబ్‌నగర్‌ వైష్ణోదేవి కాలనీలో ఉండే నరహరి (40) చిన్నచింతకుంట మండలంలోని ఉంద్యాల ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నారు. ఆయన భార్య అరుణకుమారి హన్వాడ మండలంలోని వేపూర్‌లో జీహెచ్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. 
 
నరహరికి రాజేంద్రనగర్‌లో ఉండే జగదీశ్‌ అలియాస్‌ జగన్‌తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. జగదీశ్‌ స్వస్థలం పెద్దపల్లి జిల్లాలోని మంథని. పదేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. వారి పరిచయం ఆర్థిక లావాదేవీలకు కారణమైంది. ఈ క్రమంలోనే రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు నరహరి స్థిరాస్తి వ్యాపారం కోసం జగదీశ్‌కు ఇచ్చారు. 
 
ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని రెండు నెలల నుంచి నరహరి ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సాయింత్రం 6 గంటలకు జగదీశ్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ వారి మధ్య రాత్రి 12 గంటల వరకు వాదోపవాదాలు జరిగాయి. త్వరలోనే డబ్బులు ఇస్తానని, లేకపోతే బాలానగర్‌లో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని జగదీశ్‌ హామీ ఇవ్వడంతో, సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని చెప్పి నరహరి తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలు దేరారు. 
 
ఆయన వాహనాన్ని భగీరథ కాలనీ సమీపంలో రోడ్డుపై చీకటి ప్రాంతంలో ఓ కారు ఢీకొంది. కిందపడిన నరహరి గొంతుపై పదునైన ఆయుధంతో కోయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అర్థరాత్రి నెత్తుటి మడుగులో ఉన్న వ్యక్తిని చూసిన స్థానికులు రోడ్డు ప్రమాదం అనుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి పరిశీలించగా గొంతు కోసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటన జరిగిన స్థలంలో ఉన్న కారు నంబరు ఆధారంగా ఆరాతీయగా జగదీశ్‌దని తేలింది. అనంతరం వారిద్దరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. నరహరి భార్య అరుణకుమారి సైతం జగదీశే తన భర్తను హత్య చేశాడని ఆరోపించారు. 
 
జగదీశ్‌కు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ వస్తోంది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నరహరిని కారులో వెంబడించి ఢీకొట్టి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నరహరి భార్య అరుణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనలో ఒకరే పాల్గొన్నారా.. లేక ఎక్కువ మంది ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు