పందెం రాయుళ్ళ దెబ్బకు లాకప్‌లో పందెం కోళ్లు.. అలా నిద్రలేపుతున్నాయ్!

శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (17:03 IST)
పందెం కోళ్లు కటకటాల పాలయ్యాయి. స్వేచ్ఛగా ఆరు బయట తిరుగుతూ ఇష్టమైన ఆహారం తినాల్సిన కోళ్లు పందెం రాయుళ్ళ దెబ్బకు లాకప్‌లో వున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని బాణాపురం గ్రామంలో కొందరు స్థానిక యువకులతో కలిసి ఆంధ్ర యువకులు కోడిపందాలు ఆడుతుండగా పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి యువకులతో పాటు నగదు, రెండు కోళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నారు. 
 
యువకుల మీద కేసు నమోదు చేసి నగదు, ఇతర వస్తువులను సీజ్ చేసి భద్ర పరచి కోళ్లను పోలీస్ స్టేషన్‌లోని లాకప్‌లో ఉంచారు. అప్పటి నుంచి అంటే 20 రోజులుగా లాకప్ లోనే ఉంటూ ఊచలు లెక్కపెడుతూ, స్టేషన్ కి వచ్చి పోయే వాళ్ళని చూస్తూండగా పోలీస్ సిబ్బందే సమయానికి నీరు, ఆహారం అందిస్తున్నారు. రాత్రి డ్యూటీ చేస్తే సెంట్రీలకు నిద్ర పడితే తెల్లవారుజామున నాలుగు గంటలకే కూసి నిద్ర లేపుతున్నాయి.
 
ఇవి ఏ జన్మలోనో జైల్ జీవితం తప్పించుకున్నాయో ఈ జన్మలో అనుభవిస్తున్నాయని స్టేషన్‌కు వచ్చిన వాళ్ళు సరదాగా కామెంట్ చేస్తున్నారు. నిబంధన ప్రకారం వీటిని సెల్‌లో ఉంచామని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చేవరకు ఉంచుతామని ఏస్ఐ చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు