హరీశ్‌రావు రియల్ లీడర్ ... ఆస్తి తాకట్టు పెట్టి మరీ ఆటోవాలాలకు రుణాలు
గురువారం, 21 జనవరి 2021 (10:16 IST)
తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోమారు రియల్ లీడర్ జేజేలు అందుకుంటున్నారు. ఆటోడ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడమే కాక, వారికి రుణాలు అందించేందుకు తన ఆస్తిని బ్యాం కుకు తాకట్టు పెట్టారు. దీంతో ఇప్పుడు వారికి రుణాలు సులభంగా అందనున్నాయి.
గురువారం సిద్దిపేటలో హరీశ్‌రావు చేతుల మీదుగా 850 మంది ఆటోవాలాలకు రుణాలు, డ్రెస్సులు అందించనున్నారు. వందలాది మంది ఉపాధి కోసం ఆటోలు తీసుకొని కాలం వెళ్లదీస్తుండగా కరోనాతో వారి జీవితాలు తలకిందులయ్యాయి.
రోజువారీ ఫైనాన్స్‌లు తీసుకుంటూ ఆటో నడపగా వచ్చిన మొత్తాన్ని మిత్తీలకే చెల్లించుకుంటూ మళ్లీ అప్పుల పాలవుతున్నారు. ఇదంతా గమనించిన హరీశ్‌రావు 2019 అక్టోబరులో సొసైటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
ప్రస్తుతం ఇందులో సభ్యుల సంఖ్య 850కి చేరింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆటో ఆర్‌సీ తదితర అంశాలు అర్హతగా ఎంత మంది వచ్చినా సభ్యులుగా చేర్చుకునేందుకు సొసైటీ సిద్ధంగా ఉంది.