గత నాలుగు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.
వర్షాల వల్ల వాటిల్లిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి కలెక్టర్ నారాయణరెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా కారణాల వల్ల జిల్లాలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందారని, కొన్ని పశువులు కూడా మృత్యువాత పడ్డాయని తెలిపారు.
9 చెరువులకు గండ్లు పడగా, వాటిలో పడకల్ పెద్ద చెరువు వల్ల ఎక్కువగా నష్టం వాటిల్లిందన్నారు. 42 ప్రాంతాల్లో రోడ్లపై నుండి వర్షపు జలాలు ప్రవహిస్తుండడం వల్ల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ దారి మళ్ళించామని మంత్రికి వివరించారు.