తెలంగాణా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న రేవంత్ రెడ్డి త్వరలోనే సైకిల్ దిగనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన టీడీపీకి టాటా చెప్పి... కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని పలువురు అంటున్నారు. దీనికి నిదర్శనంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను చెప్పుకుంటున్నారు. రేవంత్ ఢిల్లీ చేరుకోగానే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకే అక్కడికి వెళ్లారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను రేవంత్ ఖండించినప్పటికీ.. గుసగుసలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి.
గతంలో తెరాస మంత్రులు కూలీ పనుల పేరుతో డబ్బులు వసూలు చేయడంపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకే ఢిల్లీకి వచ్చానని రేవంత్ వివరణ ఇచ్చారు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి… కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా కలిశారు. దీంతో రేవంత్ చెబుతున్న వాదనకంటే ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే వార్తకే బలం చేకూరింది. ఇప్పటికీ తాను కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం ఖరారు కాలేదని రేవంత్ చెబుతున్నప్పటికీ… నవంబర్ 9వ తేదీన గాంధీ భవన్ మెట్లెక్కడం ఖాయమని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.